99TV News

    నాడు హోటల్‌లో స్వాగతం.. నేడు ప్రేమలో బంధం? భారతీయ యువతితో తైవాన్ నటుడి రొమాంటిక్ వీడియో...

    నాడు హోటల్‌లో స్వాగతం.. నేడు ప్రేమలో బంధం? భారతీయ యువతితో తైవాన్ నటుడి రొమాంటిక్ వీడియో...

    తైవాన్ నటుడు, మోడల్ చెంగ్ చాంగ్ ఫాన్ (Cheng Chang Fan) ఒక భారతీయ యువతిని ఆప్యాయంగా హత్తుకుని, గిరగిరా తిప్పుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటని నెటిజన్లు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. గతంలో ఓ హోటల్‌లో తనకు హారతి ఇచ్చి, తిలకం దిద్ది స్వాగతం పలికిన యువతితోనే ఆయన ప్రేమలో పడ్డారా? అన్న చర్చ ఇప్పుడు నెట్టింట జోరుగా సాగుతోంది.

    హోటల్ స్వాగతం నుంచి వైరల్ వీడియో దాకా..

    2025లో ఈ తైవాన్ నటుడు ఇండియాకు వచ్చినప్పుడు, ఓ హోటల్ సిబ్బంది అతనికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో తనకు హారతి ఇస్తున్న యువతిని చెంగ్ చాంగ్ ఫాన్ ఎంతో ఆప్యాయంగా చూస్తున్న వీడియో అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్న వీడియోలోనే వారిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కనిపించిందని, ఆ పరిచయం కచ్చితంగా ప్రేమగా మారుతుందని అప్పుడే కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.

    సరిగ్గా ఏడాది తర్వాత, ఆ అంచనాలను నిజం చేస్తూ చెంగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మరో వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోలో ఆ హోటల్ అమ్మాయితోనే అతడు మళ్లీ కలిసినట్లు సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు. "అలా.. ప్రపంచాన్ని దాటించి ఆమెను నేరుగా నా కౌగిలిలోకి తీసుకొచ్చాను" అని ఆ వీడియోకి అతడు క్యాప్షన్ పెట్టడం వీరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే, ప్రేమ వ్యవహారంపై ఇప్పటివరకు ఇద్దరిలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

    భారతీయ మహిళలపై ప్రశంసల జల్లు..

    ఇటీవలే చెంగ్ చాంగ్ ఆ భారతీయ యువతితో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, హోటల్‌లో కలిసిన అమ్మాయి ఈమెనే అని పరోక్షంగా వెల్లడించాడు. అంతేకాకుండా, భారతీయ మహిళల గొప్పదనాన్ని వివరిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ చేశాడు.

    "భారతీయ మహిళల్లోని అత్యంత అందమైన విషయం.. మీరు కేవలం చూసేది మాత్రమే కాదు, మీరు ఫీల్ అయ్యేది కూడా. వారు స్వచ్ఛంగా ప్రేమిస్తారు, ఎంతో కేరింగ్‌గా ఉంటారు, మనస్ఫూర్తిగా నవ్వుతారు. దృఢంగా ఉండాలని కోరుకునే ఈ ప్రపంచంలో వారు ఎంతో మృదుస్వభావాన్ని కలిగి ఉంటారు. వారు స్వాగతం పలికే విధానంలో ఒక అద్భుతమైన వెచ్చదనం ఉంటుంది. కొత్తవారిని కూడా తమవారిలా మార్చుకునే నిజాయితీ వారిలో ఉంటుంది" అని చెంగ్ రాసుకొచ్చాడు.

    ఇంకా ముగుస్తూ.. "ఆమె కళ్ళలో ఒక ప్రత్యేకమైన కాంతి ఉంటుంది. ఆమె నవ్వినప్పుడు, తన ఇంటి గురించి మాట్లాడినప్పుడు, చిన్న చిన్న విషయాలకే సంతోషించినప్పుడు ఆ కాంతి కనిపిస్తుంది. అది చాలా నిజాయితీగా ఉంటుంది. నేను ఆ హోటల్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజే దాన్ని చూశాను.. ఫీల్ అయ్యాను. నా జీవితంలో మొదటిసారి దేవుడు నా వైపు ఉన్నాడనిపించింది. ధన్యవాదాలు, భారత్ (IN)" అని తన మనసులోని మాటలను పంచుకున్నాడు.