నాది రాతి గుండె.. కానీ 'ఇరుముడి' చూసి ఏడ్చేశా: సక్సెస్ మీట్లో రవితేజ భావోద్వేగం
మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బేబీ నక్షత్ర, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం 'సక్సెస్ మీట్'ను ఘనంగా నిర్వహించింది.
కన్నీళ్లు పెట్టుకున్న రవితేజ..
ఈ సక్సెస్ మీట్లో హీరో రవితేజ మాట్లాడుతూ.. హిందీలో రాజ్ కుమార్ హిరాణీ సినిమాలు చూసినప్పుడు కలిగే భావోద్వేగం, తెలుగులో 'ఇరుముడి' చూసినప్పుడు కలిగిందని అన్నారు. "కరోనా సమయంలో ఓటీటీలో ఇతర భాషల సినిమాలు చూసి ఇలాంటి కథలు మనకు రావేంటని అనుకునేవాళ్లం. ఇప్పుడు ఆ మూలాలున్న కథతోనే 'ఇరుముడి' వచ్చింది. నిజానికి నాది రాతి గుండె.. నాకు అంత త్వరగా ఏడుపు రాదు. కానీ ఈ సినిమా చూసి నేను ఏడ్చేశాను" అని ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు.
శివ కథ చెప్పగానే టైటిల్ వినిపించగానే 'సూపర్' అన్నానని, జీవీ ప్రకాశ్ సంగీతం ఈ సినిమాకి ఆత్మ అని రవితేజ ప్రశంసించారు. "ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ కు అప్రయత్నంగా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వస్తున్నాయి. నా కూతురు మోక్ష కూడా సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం థియేటర్‌కు వచ్చిన వాళ్లు మళ్లీ ఈ సినిమా కోసం రావడం చాలా ఆనందంగా ఉంది" అని రవితేజ తెలిపారు.
హీరో స్వేచ్ఛనిస్తే ఇలాంటి అద్భుతాలే వస్తాయి: దర్శకుడు శివ నిర్వాణ
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. "'నిన్ను కోరి', 'మజిలి' చిత్రాలు నన్ను తెలుగు వారి ఇళ్లలోకి తీసుకెళ్తే.. ఈ 'ఇరుముడి' నన్ను వారి హృదయాల్లోకి తీసుకెళ్లింది" అని సంతోషం వ్యక్తం చేశారు. "హీరో దర్శకుడికి స్వాతంత్ర్యం ఇస్తే ఇలాంటి అద్భుతాలే వస్తాయి. ఇంటర్వెల్ ముందు రవితేజ గారిని కొట్టే సీన్ ఉంటుంది. అభిమానులు ఒప్పుకుంటారో లేదో అని ఆయన లెక్కలు వేసుకుని ఉంటే ఈ సినిమా వచ్చేది కాదు. మణెమ్మ పాత్రలో బేబీ నక్షత్ర, కావేరి పాత్రలో ప్రియా భవానీ శంకర్ జీవించారు" అని ఆయన అన్నారు.
గత 50 ఏళ్లలో ఇదే తొలిసారి: నిర్మాతలు
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ మాట్లాడుతూ.. సినిమా సాధిస్తున్న కలెక్షన్ల పట్ల హర్షం వ్యక్తం చేశారు. "ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం గత 50 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఈ సినిమా చేయడం మా అదృష్టం, మరో నాలుగు వారాల పాటు ఇది విజయవంతంగా ఆడుతుంది" అని ధీమా వ్యక్తం చేశారు.
