బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ కొత్తగా చేసిన ఒక జ్యువెలరీ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. రక్షాబంధన్ పండుగ నేపథ్యంతో తెరకెక్కిన ఈ ప్రకటనపై నెటిజన్లు, సినీ ప్రియుల నుంచి తీవ్ర స్థాయిలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
దుస్తుల ఎంపికపై విమర్శలు..
పండుగ వాతావరణం ఉన్న ఈ యాడ్‌లో కృతి సనన్ ఆఫ్-వైట్ కలర్ బ్రాగెట్/బ్రా తరహా బ్లౌజ్‌తో పాటు డ్రేప్డ్ స్కర్ట్, కేప్ ధరించి కనిపించింది. పవిత్రమైన పండుగ ప్రకటనలో అంతటి బోల్డ్ దుస్తులు ధరించడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా ఉండాల్సిన పండుగ లుక్‌ను 'మోడర్న్' పేరుతో అసభ్యకరంగా మార్చేశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
కుక్కకి రాఖీ కట్టడంపై మండిపాటు..
కేవలం దుస్తులే కాకుండా, ఈ యాడ్‌లో చూపించిన కథాంశం కూడా నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఈ ప్రకటనలో కృతి తన సోదరుడితో పాటు ఇంట్లోని పెంపుడు కుక్కకి కూడా రాఖీ కడుతుంది. పెంపుడు జంతువును కుటుంబంలో ఒక భాగంగా చూపిస్తూ రాఖీ కట్టడంపై కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంప్రదాయాలను, పండుగ పవిత్రతను ఈ బ్రాండ్ ఎగతాళి చేస్తోందని, సొంత సోదరుడి కంటే కుక్కకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చూపించడం సరైంది కాదని మండిపడుతున్నారు.
నెటిజన్ల ఘాటు కామెంట్లు..
సోషల్ మీడియాలో ఒక యూజర్ స్పందిస్తూ.. "కృతి సనన్ బ్రా తరహా బట్టలు వేసుకుని రాఖీ కడుతోంది. భారతీయ సంప్రదాయాల్లో ఇలాంటి దుస్తుల ప్రదర్శన ఎప్పుడూ చూడలేదు" అని కామెంట్ చేయగా.. మరొకరు "పవిత్రమైన రక్షాబంధన్ భావనను ఈ యాడ్ పూర్తిగా దిగజార్చింది" అని ఘాటుగా విమర్శించారు.
ఈ వివాదంపై కృతి సనన్ గానీ, సదరు జ్యువెలరీ బ్రాండ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ప్రకటనపై ట్రోలింగ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
