99TV News

    డాన్ 3' వివాదం ముదిరింది.. జోక్యం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని IMPPAకి రణ్‌వీర్ స...

    డాన్ 3' వివాదం ముదిరింది.. జోక్యం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని IMPPAకి రణ్‌వీర్ స...

    బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య జరుగుతున్న 'డాన్ 3' (Don 3) వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) జోక్యం చేసుకోవద్దని రణ్‌వీర్ సింగ్ లీగల్ టీమ్ గట్టిగా హెచ్చరించింది. ఒకవేళ తమకు వ్యతిరేకంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తూ నోటీసులు పంపింది.

    ఇది IMPPA పరిధిలోకి రాదు.. కోర్టు తేలుస్తుంది!

    ఇటీవల IMPPA నిర్వహించిన సమావేశంలో రణ్‌వీర్ బృందం ఈ మేరకు ఒక లేఖను సమర్పించింది. 'డాన్ 3' నిర్మాణ సంస్థ అయిన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తనకు ఎలాంటి అధికారిక కాంట్రాక్ట్ కుదరలేదని, కేవలం అవగాహన ఒప్పందం (MoU) మాత్రమే జరిగిందని రణ్‌వీర్ తరఫు న్యాయవాదులు వాదించారు. కాబట్టి ఈ ఆర్థిక వివాదం IMPPA పరిధిలోకి రాదని, ఏదైనా ఉంటే కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని వారు స్పష్టం చేశారు.

    రూ.45 కోట్ల నష్టపరిహారం కోరుతున్న నిర్మాతలు..

    'డాన్ 3' కోసం ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్వానీల ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ భారీ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు చేపట్టింది. అయితే, 2023 ఆగస్టులో సినిమాను ప్రకటించినప్పుడు చెప్పిన కథకు, ఆ తర్వాతి వెర్షన్‌కు చాలా మార్పులు జరిగాయని, అలాగే షూటింగ్ కూడా పదే పదే ఆలస్యమవుతోందన్న కారణాలతో రణ్‌వీర్ సింగ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అంతర్జాతీయ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కావడానికి కొద్దిరోజుల ముందే ఆయన వైదొలగడంతో.. అప్పటికే చేసిన ఖర్చుల వల్ల తమకు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్మాతలు IMPPAకు ఫిర్యాదు చేశారు.

    దీనిపై స్పందించిన రణ్‌వీర్ తండ్రి జగ్జీత్ సింగ్ భవనానీ, తమ లీగల్ టీమ్‌తో కలిసి IMPPA ప్రతినిధులను కలిశారు. నిర్మాణ సంస్థ క్లెయిమ్ చేస్తున్న 45 కోట్ల నష్టపరిహారాన్ని సవాలు చేస్తూ కౌంటర్ దాఖలు చేశారు. ప్రస్తుతానికి IMPPA లీగల్ టీమ్ ఇరు వర్గాల పత్రాలను పరిశీలిస్తోంది. ఇరు వర్గాలు ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో.. ఈ వివాదం త్వరలో కోర్టు మెట్లు ఎక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.