పవర్‌ఫుల్ విలన్‌ను ఎవరూ ఆపలేరు కదా! 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' (Avengers: Endgame) క్లైమాక్స్‌లో బూడిదగా మారిన మాడ్ టైటాన్ 'థానోస్' మళ్లీ రాబోతున్నాడు. రాబర్ట్ డౌనీ జూనియర్ MCUలోకి తిరిగి వచ్చినప్పుడే, మార్వెల్ హిస్టరీలో మోస్ట్ ఐకానిక్ విలన్ అయిన థానోస్ కూడా ఏదో ఒక రూపంలో వస్తాడని అభిమానులు ఊహించారు. ఇప్పుడు అదే నిజం కాబోతోంది.
డిస్నీ కాలిఫోర్నియా అడ్వెంచర్‌లో రాబోతున్న సరికొత్త ఎట్రాక్షన్ 'అవెంజర్స్: ఇన్ఫినిటీ డిఫెన్స్' (Avengers: Infinity Defense)లో 'కింగ్ థానోస్' (King Thanos)ను ప్రధాన విలన్‌గా పరిచయం చేయనున్నారు. 2028లో ప్రారంభం కానున్న ఈ థీమ్ పార్క్ ఎట్రాక్షన్‌కు సంబంధించి డిస్నీ కొత్త లుక్‌ను రివీల్ చేసింది.
సరికొత్త లుక్‌తో కింగ్ థానోస్..
ఇది థానోస్ విజయం సాధించిన ఒక ఆల్టర్నేట్ యూనివర్స్‌కు (మల్టీవర్స్) సంబంధించిన కథ. ఇందులో థానోస్ తలపై భారీ కిరీటంతో, ఎండ్‌గేమ్‌లో వాడిన డబుల్ బ్లేడ్ కత్తికి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌తో కనిపించనున్నాడు. ఆ కత్తికి విద్యుత్ తరంగాలు, మధ్యలో మెరుస్తున్న ఒక ఆర్బ్ (Orb) ఉన్నాయి. డాక్టర్ స్ట్రేంజ్ కు చెందిన 'శాంక్టమ్ శాంక్టోరమ్' ధ్వంసమైన శిథిలాల నుంచి కింగ్ థానోస్ వస్తున్నట్లు ఇటీవల జరిగిన D23 ఈవెంట్‌లో వెల్లడించారు.
అవెంజర్స్ బృందాన్ని మళ్లీ ఏకం చేసి, కింగ్ థానోస్ ఇతర ప్రపంచాలను ఆక్రమించకుండా ఆపడమే ఈ 'అవెంజర్స్: ఇన్ఫినిటీ డిఫెన్స్' ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా వాకాండ, అస్గార్డ్, న్యూయార్క్ సిటీ వంటి మార్వెల్ ప్రదేశాలను సందర్శకులు చూడొచ్చు.
టోనీ స్టార్క్‌గా మళ్లీ రాబర్ట్ డౌనీ జూనియర్..
ఈ అట్రాక్షన్ కోసం పలువురు ప్రముఖ మార్వెల్ స్టార్స్ తిరిగి రానున్నారు. ప్రీ-షోలో కమలా ఖాన్‌గా ఇమాన్ వెల్లానీ (మిస్ మార్వెల్) కనిపించనుండగా.. టోనీ స్టార్క్ (ఐరన్ మ్యాన్)గా రాబర్ట్ డౌనీ జూనియర్, థోర్‌గా క్రిస్ హేమ్స్‌వర్త్, సామ్ విల్సన్ (కెప్టెన్ అమెరికా)గా ఆంథోనీ మాకీ, క్లింట్ బార్టన్ (హాక్ ఐ)గా జెరెమీ రెన్నర్ నటించనున్నారు.
ముఖ్యంగా 'అవెంజర్స్: డూమ్స్‌డే' షూటింగ్ సమయంలోనే రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ టోనీ స్టార్క్ పాత్రకు సంబంధించిన ఫుటేజ్‌ను కూడా చిత్రీకరించడం విశేషం. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో ఆయన కేవలం 'డాక్టర్ డూమ్'గానే కాకుండా టోనీ స్టార్క్‌గా కూడా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ 'అవెంజర్స్: ఇన్ఫినిటీ డిఫెన్స్' 2028లో 'స్టార్క్ ఫ్లైట్ ల్యాబ్' అట్రాక్షన్‌తో పాటు డిస్నీ కాలిఫోర్నియా అడ్వెంచర్‌లో అందుబాటులోకి రానుంది.
