99TV News

    నైట్ షూట్స్‌లో నిద్ర రాకుండా ఉండేందుకు సాయి పల్లవి ఏం చేస్తుందో తెలుసా?

    నైట్ షూట్స్‌లో నిద్ర రాకుండా ఉండేందుకు సాయి పల్లవి ఏం చేస్తుందో తెలుసా?

    వైవిధ్యమైన కథలు, సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే సాయి పల్లవిలో గొప్ప నటి మాత్రమే కాదు, ఓ అద్భుతమైన చిత్రకారిణి కూడా దాగుంది. అయితే, తనలోని ఈ కళను బయటకు తీయడానికి ప్రధాన కారణం 'నైట్ షూట్స్' అని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన నైట్ షూట్స్ కష్టాలను, వాటిని ఎదుర్కోవడానికి తను ఫాలో అయ్యే ట్రిక్‌ను అభిమానులతో పంచుకుంది.

    బ్యాగ్‌లో ఎప్పుడూ క్రేయాన్స్, స్కెచెస్..

    రాత్రి వేళల్లో నిద్రను కంట్రోల్ చేసుకోవడం తనకు సవాల్‌గా అనిపిస్తుందని సాయి పల్లవి తెలిపింది. "నాకు నిద్ర ఆపుకోవడం చాలా కష్టం. అందుకే నైట్ షూట్స్‌లో మేల్కొని ఉండేందుకు నాలోని చిత్రకారిణికి పని చెబుతుంటాను. నా బ్యాగ్‌లో ఎప్పుడూ డ్రాయింగ్ బుక్, స్కెచెస్, క్రేయాన్స్ తప్పనిసరిగా ఉంటాయి. రాత్రి పూట సెట్‌లో నిద్ర వస్తున్నట్లు అనిపించగానే వెంటనే బుక్ తీసి బొమ్మలు వేయడం, రంగులు దిద్దడం మొదలుపెడతాను. అలా నన్ను నేను పెయింటింగ్‌లో బిజీగా ఉంచుకుని నిద్ర దరిచేరకుండా చూసుకుంటాను. ఇప్పటికే అలా నా డ్రాయింగ్స్‌తో ఎన్నో బుక్స్ నింపేశాను" అని ఆమె తన సీక్రెట్‌ను బయటపెట్టింది.

    వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా..

    ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ సరసన ప్రతిష్టాత్మక 'రామాయణ' చిత్రంలో సీతగా నటిస్తోంది. దీనితో పాటు తమిళంలో 'ఓం' అనే సినిమాతో పాటు, దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.