99TV News

    భర్త ప్రాణాలతో బొట్టు, గాజులకు లింక్ ఏంటి? సమాజాన్ని ప్రశ్నిస్తూ అనసూయ ఎమోషనల్ పోస్ట్!

    భర్త ప్రాణాలతో బొట్టు, గాజులకు లింక్ ఏంటి? సమాజాన్ని ప్రశ్నిస్తూ అనసూయ ఎమోషనల్ పోస్ట్!

    ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మూడేళ్ల క్రితం తన తండ్రి మరణించిన తర్వాత, తన తల్లి జీవితంలో వచ్చిన మార్పులను చూసి తాను ఎంతగా మథనపడుతున్నానో వివరిస్తూ ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను పంచుకున్నారు. భర్త చనిపోతే మహిళలు బొట్టు, గాజులు తీసేయాలనే ఆచారంపై ఆమె సమాజానికి పలు సూటి ప్రశ్నలు సంధించారు.

    మూడేళ్లుగా వెంటాడుతున్న ప్రశ్న!

    తన తండ్రి మరణం తర్వాత తల్లి పడుతున్న వేదన, సమాజం విధించిన ఆంక్షలు తనను ఎంతగానో కలచివేస్తున్నాయని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు.

    అందమైన అమ్మ: "మా అమ్మ ముస్తాబైతే చాలా అందంగా ఉంటుంది. చక్కగా బొట్టు, కాటుక, రంగురంగుల గాజులు, గజ్జెలు పెట్టుకుంటే చూడముచ్చటగా ఉంటుంది."

    సమాజం మాటల వల్లే దూరం: "నాన్న చనిపోయాక సమాజం మాట్లాడే మాటల వల్ల ఆమె వాటన్నింటికీ దూరమైంది. ఆ పరిస్థితులు చూసినప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. ముఖ్యంగా ఆడపిల్లలు నా బాధను అర్థం చేసుకోగలరు."

    ఆ అలంకరణను పరిచయం చేసింది ఎవరు?

    ఈ సందర్భంగా సమాజంలో పాతుకుపోయిన ఒక ఆచారంపై అనసూయ లాజికల్ గా పలు ప్రశ్నలు అడిగారు.

    "ఆడపిల్లలకు బొట్టు, కాటుక, గాజులు, గోరింటాకు వంటివి పెళ్లికి ముందే వాళ్ల అమ్మ లేదా అమ్మమ్మలు పరిచయం చేస్తారు కదా? అలాంటప్పుడు ఆ అలంకరణకు భర్త జీవితంతో ఎందుకు ముడిపెడుతున్నారు?"

    "నా దృష్టిలో చెప్పాలంటే.. ఈ అలంకరణను పరిచయం చేసిన అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా వాటిని వదులుకోవాలి?" అని ఆమె ప్రశ్నించారు.

    ఇవన్నీ ఎక్కడ రాసి ఉన్నాయి?

    మహిళల అలంకరణ అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత ఇష్టమని, దానిపై సమాజం ఎందుకు ఆంక్షలు విధిస్తుందని అనసూయ నిలదీశారు.

    "బొట్టు, గాజులు వేసుకోవడం అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత ఇష్టం. ఏవైనా పూజలు, శుభకార్యాలు జరిగినప్పుడు కూడా మహిళల మీద కొన్ని బలవంతపు రూల్స్ రుద్దడం నాకింకా కనిపిస్తూనే ఉంది. అసలు ఇవన్నీ ఎక్కడ రాసి ఉన్నాయి? నేను ఎవరినీ ఉద్దేశించి, ఎవరికీ వ్యతిరేకంగా ఈ మాటలు అనడం లేదు. నాలో మెదిలిన ఒక సందేహాన్ని మాత్రమే మీ అందరితో పంచుకుంటున్నాను" అని అనసూయ తన మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తపరిచారు.