99TV News

    ఐఏఎస్ అవ్వాలనుకుని బాలీవుడ్ హీరోయిన్ అయ్యా.. అసలు సీక్రెట్ బయటపెట్టిన యామీ గౌతమ్!

    ఐఏఎస్ అవ్వాలనుకుని బాలీవుడ్ హీరోయిన్ అయ్యా.. అసలు సీక్రెట్ బయటపెట్టిన యామీ గౌతమ్!

    అవకాశం వస్తే చాలు.. ఎంతోమంది చిత్రపరిశ్రమలోకి వచ్చి వెండితెరపై మెరిసిపోవాలని కలలు కంటారు. కానీ బాలీవుడ్ ప్రముఖ నటి యామీ గౌతమ్ ఆలోచనలు మాత్రం మొదట్లో వేరేలా ఉండేవి. అసలు సినీ ఇండస్ట్రీకి రావాలనే ఆలోచనే తనకు లేదని, ఐఏఎస్ అధికారి కావాలని అనుకున్నానని ఒక సందర్భంలో ఈ భామ ఆసక్తికర విషయాలను పంచుకుంది.

    న్యాయశాస్త్రం చదివాను..

    శక్తిమంతమైన పాత్రలు, వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరించే యామీ గౌతమ్.. తన కెరీర్ తొలినాళ్ల గురించి మాట్లాడుతూ— "నా కెరీర్ విషయంలో నాకు రకరకాల ఆలోచనలు ఉండేవి. అందుకే చిత్రపరిశ్రమ ఎప్పుడూ నా మొదటి ప్రాధాన్యతగా లేదు. ఏదైనా భిన్నమైన రంగంలో రాణించాలని నాన్నతో చెప్పాను. ఆ క్రమంలోనే న్యాయశాస్త్రం (Law) కూడా చదివాను. నేను చదువులో ఎప్పుడూ మంచి విద్యార్థినినే. నటన గురించి బయట ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు" అని తెలిపింది.

    ఫోన్‌లో ఆడిషన్ తీసి పంపిన నాన్న!

    అయితే చిన్నప్పటి నుంచి సినిమాలంటే అమితమైన ఇష్టం ఉండేదని ఆమె పేర్కొంది. "సినిమాలు చూస్తున్నప్పుడు అందులోని పాత్రల్లో నన్ను నేను ఊహించుకునేదాన్ని. కానీ ఆ ఊహలు కలలుగానే మిగిలిపోతాయేమో అనుకున్నా. ఎందుకంటే నటన వైపు అడుగులు వేసేంత ధైర్యం నాకు ఉందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ తర్వాత ఒక టెలివిజన్ షో కోసం ఆడిషన్ ఇవ్వమని మా కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను బాగా ప్రోత్సహించారు. చివరికి మా నాన్న ఇంట్లోనే నా ఆడిషన్‌ను ఫోన్‌లో షూట్ చేసి డైరెక్టర్‌కు పంపించారు" అని తన తొలి అడుగుల గురించి యామీ గుర్తుచేసుకుంది.

    ఇలా అనుకోకుండా బుల్లితెరపై అడుగుపెట్టిన యామీ గౌతమ్, ఆ తర్వాత వెండితెరపై స్టార్ కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో 'నయీ నవేలి' అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది.