రోగనిరోధక వ్యవస్థలో మార్పులతో సమస్య
సాధారణంగా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వైరస్లు, బ్యాక్టీరియా వంటి హానికరమైన వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఈ వ్యవస్థ పొరపాటున శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు, కణజాలాలపైనే దాడి చేస్తుంది. ఫలితంగా శరీరంలోని వివిధ అవయవాలు ప్రభావితమవుతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి వ్యాధులు ఈ కోవలోకి వస్తాయి.
మహిళల్లో ఎక్కువగా కనిపించడానికి కారణాలేంటి?
హార్మోన్ల ప్రభావం, జన్యుపరమైన అంశాలు, పర్యావరణ పరిస్థితులు సహా పలు కారణాలు ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పుతో సంబంధం కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని వ్యాధులు మహిళల్లో, ముఖ్యంగా పునరుత్పత్తి వయసులో ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. కాలుష్యం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అంశాలు కూడా కొన్ని వ్యాధుల లక్షణాలను తీవ్రతరం చేయవచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
తరచూ అలసటగా అనిపించడం, కీళ్ల నొప్పులు లేదా వాపు, చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలడం, జ్వరం, కళ్లలో లేదా నోటిలో పొడిబారడం వంటి లక్షణాలను గమనించాలి. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినంత మాత్రాన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించలేం. అయితే లక్షణాలు పదేపదే కనిపించినా, ఎక్కువకాలం కొనసాగినా వైద్యులను సంప్రదించడం అవసరం.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
తగినంత నిద్రపోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని నియంత్రించుకోవడం ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇప్పటికే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నవారు వైద్యుల సూచనల ప్రకారం చికిత్స కొనసాగించాలి. సొంతంగా స్టెరాయిడ్లు లేదా నొప్పి నివారణ మందులు వాడకూడదు. ఈ వ్యాధులను గుర్తించేందుకు ఒకే పరీక్ష సరిపోకపోవచ్చు కాబట్టి, అవసరమైన పరీక్షలను వైద్యుల సలహాతోనే చేయించుకోవాలి.
