న్యూఢిల్లీ:
క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. క్యాన్సర్ చికిత్సలో వినియోగించే 543 బ్రాండ్ల ఔషధాల గరిష్ట విక్రయ ధరలను (MRP) సవరిస్తూ జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల నిర్ణయ సంస్థ (NPPA) కీలక ప్రకటన విడుదల చేసింది. సవరించిన ఈ కొత్త ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో కొన్ని అత్యంత ఖరీదైన క్యాన్సర్ మందుల ధరలు 80 శాతానికి పైగా తగ్గే అవకాశం ఉంది.
ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (TMR) విధానం:
కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం కింద పనిచేసే NPPA, ఈ మేరకు సవరించిన ధరలతో కూడిన జాబితాను విడుదల చేసింది. అక్టోబర్ 17న 137 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందుల కోసం ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (TMR) విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం ద్వారా మందుల అమ్మకాలపై ఉన్న అధిక ట్రేడ్ మార్జిన్లకు కళ్లెం వేసి, క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రూ. 20 వేల మందు రూ. 5 వేలకే!
ఈ ధరల తగ్గింపు వల్ల రోగులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.
అబాట్ సంస్థకు చెందిన 'బెవాసిజాబ్' (100 mg/4 ml) ఇంజెక్షన్ ధర రూ. 21,767 నుంచి రూ. 5,930కి తగ్గింది.
'ఫుల్‌వెస్ట్రాంట్' (50 mg) ఇంజెక్షన్ ధర రూ. 26,072 నుంచి రూ. 5,491కి దిగివచ్చింది.
డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెందిన 'అజాసిటిడిన్' (100 mg) ఇంజెక్షన్ ధర రూ. 6,337 నుంచి రూ. 1,495కి తగ్గింది.
కీలకమైన ఔషధాలు అందుబాటులోకి:
ధరలు తగ్గిన ఈ మందుల జాబితాలో 20కి పైగా క్యాన్సర్ రకాల చికిత్సలో వినియోగించే ఇమ్యునోథెరపీ ఔషధాలు ఉన్నాయి. వీటితో పాటు రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ రోగుల కోసం వాడే డెనోసుమాబ్, న్యూట్రోపెనియా నివారణకు ఉపయోగించే పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్, పెద్దప్రేగు, అండాశయ, గర్భాశయ క్యాన్సర్ల చికిత్సలో వాడే బెవాసిజుమాబ్ వంటి కీలకమైన మందులు కూడా ఉన్నాయి.
ఔషధ తయారీ కంపెనీలు అందించిన సమాచారం ఆధారంగా NPPA ఈ 543 ఔషధాల జాబితాను రూపొందించింది. మిగిలిన కంపెనీలు కూడా తమ సవరించిన ధరల వివరాలను అందించిన తర్వాత ఈ జాబితాను మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
