హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 25న జరగనున్న భారీ నిమజ్జనానికి నగర పోలీసులు సిద్ధమయ్యారు. లక్షలాది మంది భక్తులు, వేలాది గణేష్ విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఖైరతాబాద్ బడా గణేష్‌ను ఇప్పటికే సుమారు 25 లక్షల మంది, బాలాపూర్ గణేష్‌ను 15 లక్షల మంది దర్శించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగర పరిధిలో ఇప్పటివరకు 6,108 విగ్రహాలు సహా మొత్తం 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తైంది.
Highlights
20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో పర్యవేక్షణ
25 లక్షల మంది ఖైరతాబాద్ గణేష్‌ను దర్శనం
నగరంలో 6,108 గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తి
డీజేలు, అధిక శబ్ద పరికరాలు, బాణసంచాపై నిషేధం
మహిళల భద్రత కోసం 26 షీ టీమ్స్
జలాశయాల వద్ద రెస్క్యూ బోట్లు, నిపుణులైన డైవర్ల ఏర్పాటు
20 వేల మంది పోలీసులతో బందోబస్తు
లాఅండ్‌ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ తదితర విభాగాలకు చెందిన సుమారు 20 వేల మంది సిబ్బందిని మోహరించారు. ఇతర జిల్లాల నుంచి మరో 8,142 మంది అధికారులు ఏడు భద్రతా జోన్లలో విధులు నిర్వహించనున్నారు.
10 వేల సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
ప్రధాన నిమజ్జన మార్గాల్లో 10 వేలకుపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. 24 డ్రోన్లు, దాదాపు 100 హై-రైజ్ కెమెరాలతో రద్దీని పర్యవేక్షించనున్నారు.
డీజేలు, బాణసంచాపై నిషేధం
నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, సౌండ్ మిక్సర్లు, అధిక శబ్ద పరికరాలు, బాణసంచాపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు
మహిళల భద్రత కోసం 26 షీ టీమ్స్ మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నాయి. నేరాలు, వేధింపులు, చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా మోహరించారు.
వదంతులు వ్యాప్తి చేయొద్దన్న సీపీ
సోషల్ మీడియాలో వదంతులు, విద్వేషపూరిత లేదా రెచ్చగొట్టే పోస్టులు ప్రచారం చేయవద్దని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. నిర్దేశించిన ప్రాంతాల్లోనే నిమజ్జనం నిర్వహిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
