99TV News

    హైదరాబాద్ రెస్టారెంట్లపై TG Safe దాడులు, 6 లైసెన్సులు రద్దు

    హైదరాబాద్ రెస్టారెంట్లలో అపరిశుభ్రత.. TG Safe దాడుల్లో 6 లైసెన్సులు రద్దు

    హైదరాబాద్ రెస్టారెంట్లలో అపరిశుభ్రతపై టీజీ సేఫ్ చర్యలు

    అల్ఫా హోటల్ సహా 6 సంస్థల ఫుడ్ లైసెన్సులు రద్దు; 300 కిలోల నాసిరకం ఆహారం పారబోత

    హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం నిర్వహించిన తనిఖీల్లో తీవ్రమైన అపరిశుభ్ర పరిస్థితులు బయటపడ్డాయి. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా ఆహారం తయారీ, నిల్వలు ఉన్నట్లు గుర్తించి 6 ఫుడ్ లైసెన్సులు రద్దు చేశారు.

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని అల్ఫా హోటల్‌లో పెచ్చులూడిన గోడలు, నిండిన డ్రైనేజీలు, వంటగది పరిసరాల్లో పావురాల విసర్జితాలు, వండిన ఆహార నిల్వలు, దుర్వాసన వెదజల్లుతున్న మరుగుదొడ్లు కనిపించాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితులను తీవ్రంగా పరిగణించి హోటల్ లైసెన్సును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంగళ్‌రావు నగర్‌లోని పందెంకోడి రెస్టారెంట్‌లో తుప్పుపట్టిన కత్తులు, వంటగదిలో బొద్దింకలు గుర్తించగా, జూబ్లీహిల్స్‌లోని లాహమ్ హౌస్‌లో చెత్త తొలగించకుండానే వంటలు చేస్తున్నట్లు తేలింది.

    గౌలిదొడ్డిలోని స్పైస్ కిచెన్‌లో వండిన మాంసం, పచ్చి మాంసాన్ని కలిపి నిల్వ ఉంచడాన్ని అధికారులు గుర్తించారు. కూకట్‌పల్లిలోని న్యూ బ్లూస్టార్ రెస్టారెంట్, పంజాగుట్టలోని శ్రీనివాస బాయ్స్ హాస్టల్ ఫుడ్ లైసెన్సులు కూడా రద్దయ్యాయి. తనిఖీల్లో మొత్తం సుమారు 300 కిలోల నాసిరకం ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారబోయించారు.

    HIGHLIGHTS

    - 6 ఫుడ్ లైసెన్సులు రద్దు

    - అల్ఫా హోటల్‌పై తక్షణ చర్య

    - 300 కిలోల ఆహారం పారబోత

    - పలువురికి షోకాజ్ నోటీసులు

    సికింద్రాబాద్ ఎస్‌పీ రోడ్డులోని తత్వ రెస్టారెంట్‌కు వారం రోజుల్లో మార్పులు చేయాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్‌లోని లాజ్వత్ హైదరాబాద్‌వాలా, నిజాంపేటలోని కేపీఎన్ ఫ్రెష్, శేరిలింగంపల్లిలోని ప్రిన్స్ అరేబియన్ రెస్టారెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించని సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.

    నగరవ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని టీజీ సేఫ్ అధికారులు తెలిపారు. నోటీసులు అందుకున్న సంస్థల వివరణలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు, రెస్టారెంట్లపై మరిన్ని తనిఖీలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

    Also Read- హైదరాబాద్ ఆకాశంలో లియోనిడ్ ఉల్కాపాతం.. 87 ఉల్కలు రికార్డ్