ఆస్ట్రేలియాలో భారతీయులను లక్ష్యంగా చేసుకున్న జాత్యహంకార స్టిక్కర్లపై ఆగ్రహం
సెస్నాక్లో భారత సంస్కృతిని అవమానించే స్టిక్కర్లు కనిపించడంతో స్థానిక ఎంపీ తీవ్రంగా ఖండించారు
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సెస్నాక్ పట్టణంలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని అతికించిన జాత్యహంకార స్టిక్కర్లు స్థానిక భారతీయ సమాజంలో ఆందోళన రేపాయి. సిడ్నీకి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు.
భారత సంస్కృతిని కించపరిచేలా ఉన్న ఆ స్టిక్కర్లలో అవమానకరమైన చిత్రం, సందేశం ముద్రించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియా జనాభాలో 32% మంది విదేశాల్లో పుట్టినవారేనని, వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారని వాటిలో పేర్కొన్నారు. వలస వచ్చిన వారిని వెంటనే తిరిగి పంపాలనే నినాదం కూడా ఉండటంతో ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి.
హంటర్ నియోజకవర్గ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుడు డాన్ రెపచోలి ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. “ఇవి చాలా అసహ్యకరమైన స్టిక్కర్లు,” అని ఆయన చెప్పారు. “ఈ చెత్తను వ్యాప్తి చేస్తున్న పిరికిపందలు మా సమాజానికి ప్రతినిధులు కారు,” అని డాన్ రెపచోలి అన్నారు. “సెస్నాక్లో గానీ, హంటర్లో గానీ జాత్యహంకారానికి చోటు లేదు,” అని ఆయన స్పష్టం చేశారు.
HIGHLIGHTS
- సెస్నాక్ సిడ్నీకి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది
- న్యూ సౌత్ వేల్స్లో పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు
- డాన్ రెపచోలి స్టిక్కర్లను వెంటనే తొలగించాలని కోరారు
- భారతీయులపై విద్వేష సందేశాలపై స్థానికుల్లో ఆందోళన
“ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం,” అని డాన్ రెపచోలి హెచ్చరించారు. స్టిక్కర్లు ఎక్కడైనా కనిపిస్తే వివరాలు తెలియజేయాలని, వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రజలను కోరారు. డాన్ రెపచోలి అధికార ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీకి చెందినవారు.
సిడ్నీలోని భారత కాన్సులేట్ జనరల్ వివరాల ప్రకారం, న్యూ సౌత్ వేల్స్, సౌత్ ఆస్ట్రేలియాలో కలిపి సుమారు 1,75,000 మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. ఇది ఆస్ట్రేలియాలోని మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 38%గా అంచనా. తాజా ఘటన నేపథ్యంలో స్థానిక సంస్థలు స్టిక్కర్ల తొలగింపు, ఫిర్యాదుల పరిశీలనపై తదుపరి చర్యలు తీసుకోనున్నాయి.
