సౌదీ అరేబియాలో దాడులను ఖండించిన భారత్.. ఐసీయూలో నలుగురు భారతీయులు
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి దాడులు పూర్తిగా ఆమోదయోగ్యం కావని, తక్షణమే నిలిపివేయాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ దాడుల్లో గాయపడిన భారతీయులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడి, అక్టోబర్ 11న మరణించిన భారతీయుడి అంత్యక్రియలను కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు రియాద్‌లో నిర్వహించినట్లు తెలిపారు. భారత రాయబార కార్యాలయం ఇందుకు సహకరించిందని పేర్కొన్నారు.
ఐసీయూలో నలుగురు.. ఆసుపత్రుల్లో ఎనిమిది మంది
దాడుల్లో గాయపడిన 11 మంది భారతీయుల్లో ముగ్గురు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని జైస్వాల్ తెలిపారు. మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారని, వారిలో నలుగురు ఐసీయూలో ఉన్నారని వివరించారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు క్షతగాత్రులను క్రమం తప్పకుండా పరామర్శిస్తూ, వారి కుటుంబ సభ్యులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.
విమాన సర్వీసులకు అంతరాయం
రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అబ్హా విమానాశ్రయంతో పాటు ఇతర ప్రాంతాల్లోని విమానాశ్రయాలపై జరిగిన దాడులతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రియాద్, దమ్మామ్, మదీనా, జెడ్డా నగరాలకు వెళ్లే లేదా అక్కడి నుంచి బయలుదేరే కొన్ని విమానాల షెడ్యూళ్లు ప్రభావితమయ్యాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. సౌదీలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు రాయబార కార్యాలయం తాజా సమాచారాన్ని అందిస్తోంది.
సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్‌లోని అరామ్‌కో సంస్థకు చెందిన ఓ కేంద్రంలో దాడి అనంతరం పరిమిత స్థాయిలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ ప్రజలు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం ప్రకటించింది. ఆ ప్రాంతంలో త్వరలోనే శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించింది.
