Japan | జపాన్‌ను వణికించిన భూకంపం.. 30 మందికి గాయాలు
జపాన్‌లో శక్తివంతమైన భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఆదివారం తెల్లవారుజామున టోక్యోతో పాటు తూర్పు జపాన్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ఘటనలో కనీసం 30 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
5.9 తీవ్రతతో భూకంపం
టోక్యో ప్రాంతంతో పాటు తూర్పు జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ ఇబారకి ప్రిఫెక్చర్‌లో సముద్ర మట్టానికి సుమారు 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. టోక్యోలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ నీటి పైపులు పగిలిపోయాయి. వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం.
రైలు సర్వీసులకు అంతరాయం
భూకంపం ప్రభావంతో టోక్యో, నరిటా విమానాశ్రయం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే కొన్ని స్థానిక రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
అయితే షింకన్సెన్ బుల్లెట్ రైలు సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయని ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది.
రోడ్లు, వంతెనలు, భవనాలకు నష్టం
భూకంప ప్రభావంతో పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది.
భూకంపం కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అధికారులు నష్టం వివరాలను సేకరిస్తున్నారు.
