ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు శిక్షణ విమానాలు
మనీలాకు సమీపంలో: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణ విన్యాసాల్లో పాల్గొన్న రెండు సైనిక విమానాలు గాల్లోనే ఢీకొని కూలిపోవడంతో నలుగురు పైలట్లు మరణించారు. మనీలాకు దక్షిణంగా ఉన్న ఫెర్నాండో వైమానిక స్థావరం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు ఫిలిప్పీన్స్ వైమానిక దళం వెల్లడించింది.
ప్రమాదానికి గురైన విమానాలు ఎస్‌ఎఫ్-260 రకానికి చెందిన సింగిల్ ప్రొపెల్లర్ శిక్షణ విమానాలు. శిక్షణ సమయంలో రెండు విమానాలు గాల్లో ఢీకొన్నట్లు వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది. అనంతరం అవి అదుపు తప్పి కిందకు దూసుకెళ్లి కూలిపోయాయి.
ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు వైమానిక దళ ప్రతినిధి కల్నల్ అల్విన్ కాపింగుయాన్ తెలిపారు. విమానాలు వైమానిక స్థావరం పరిధిలోనే కూలిపోయాయని, నలుగురు పైలట్లు మినహా ఇతరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన నేపథ్యంలో ఎస్‌ఎఫ్-260 రకానికి చెందిన విమానాల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
ఫిలిప్పీన్స్‌లో గతంలోనూ సైనిక శిక్షణ విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మేలో బెంగ్వెట్ ప్రావిన్స్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు సైనిక పైలట్లు మరణించారు. 2023లోనూ ఎస్‌ఎఫ్-260 విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనతో సైనిక విమానాల శిక్షణ భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
