99TV News

    Saudi Court Overturns Sri Lankan Worker’s Death Sentence

    Saudi Court Overturns Sri Lankan Worker’s Death Sentence

    ఫేస్‌బుక్‌ వ్యాఖ్య కేసులో శ్రీలంక కార్మికుడికి ఊరట.. మరణశిక్ష రద్దు

    సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యకు సంబంధించిన దైవదూషణ కేసులో శ్రీలంకకు చెందిన వలస కార్మికుడు అనోజన్‌ శివరాసకు సౌదీ అరేబియా సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఆయనకు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాన్ని శ్రీలంక ప్రభుత్వం స్వాగతించింది. దౌత్యపరమైన, న్యాయపరమైన ప్రయత్నాల అనంతరం ఈ నిర్ణయం వెలువడినట్లు శ్రీలంక ఉప విదేశాంగ మంత్రి అరుణ్‌ హేమచంద్ర తెలిపారు.

    27 ఏళ్ల శివరాసకు సెప్టెంబర్‌లో మరణశిక్ష విధించారు. ఇస్లాం మతం, ప్రవక్త మహమ్మద్‌పై ఫేస్‌బుక్‌లో వ్యాఖ్య చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు నమోదైంది. అంతకుముందు అల్‌ అహ్సా క్రిమినల్‌ కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు మూడు మిలియన్‌ సౌదీ రియాళ్ల జరిమానా విధించినట్లు సమాచారం.

    శ్రీలంక ప్రభుత్వం హర్షం

    మరణశిక్ష రద్దు కావడం శివరాస, ఆయన కుటుంబానికి ఉపశమనమని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే పేర్కొన్నారు. సౌదీ ప్రభుత్వం, దౌత్యాధికారులు, విదేశాంగ శాఖ అధికారులు, న్యాయ బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన న్యాయ ప్రక్రియ పూర్తయ్యే వరకు శివరాసకు, ఆయన కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

    వాగ్వాదం సందర్భంగా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్య చేసిన శివరాస దాన్ని కొద్దిసేపటికే తొలగించి క్షమాపణ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఆ వ్యాఖ్య స్క్రీన్‌షాట్‌ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆయనను జూలైలో అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో మరణశిక్ష విధించడంతో శ్రీలంకలో ఆందోళన పెరిగింది.

    తాజా నిర్ణయంతో మరణశిక్ష రద్దయినప్పటికీ, కేసుకు సంబంధించిన మిగిలిన న్యాయ ప్రక్రియ ఇంకా పూర్తికావాల్సి ఉంది. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లే తమ పౌరులకు అవసరమైన సహాయం అందిస్తామని శ్రీలంక ప్రభుత్వం స్పష్టం చేసింది.