2026 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని షేక్ హసీనా ప్రకటన
జైలుకెళ్లేందుకైనా సిద్ధమని మాజీ ప్రధాని వ్యాఖ్య; మరణశిక్ష తీర్పు రాజకీయ ప్రేరేపితమని ఆరోపణ
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా 2026 డిసెంబర్ నాటికి స్వదేశానికి తిరిగి వెళ్తానని ప్రకటించారు. విదేశీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తూ, పునరాగమనం శాంతియుతంగా, చట్టబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
“నేను ఎప్పుడు వెళ్తానన్నదానికంటే, ఏ విధంగా వెళ్తానన్నదే ముఖ్యమైనది,” అని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయ పోరాటంలో భాగంగా అవసరమైతే జైలుకెళ్లేందుకైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ తనకు విధించిన మరణశిక్షను ఆమె తీవ్రంగా ఖండించారు.
“ఆ తీర్పు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనది, అన్యాయమైనది,” అని హసీనా చెప్పారు. తన నిష్క్రమణ అనంతరం ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆమె రాజ్యాంగ విరుద్ధమైనదిగా అభివర్ణించారు. తనపై జరుగుతున్న విచారణను “ప్రహసనం”గా పేర్కొంటూ, చట్టపరమైన మార్గాల్లోనే తాను ముందుకు సాగుతానని తెలిపారు.
HIGHLIGHTS
- 2026 డిసెంబర్ నాటికి తిరిగి వెళ్లాలని హసీనా ప్రకటన
- 2025 నవంబర్ మరణశిక్ష తీర్పును ఖండన
- జైలుకెళ్లేందుకైనా సిద్ధమని వ్యాఖ్య
- అవామీ లీగ్ పునర్నిర్మాణంపై దృష్టి
తన అవామీ లీగ్ పార్టీపై ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాల నిషేధం ఉన్నప్పటికీ, పార్టీని పునర్నిర్మించడం, శ్రేణులతో సంబంధాలను బలోపేతం చేయడం తన ప్రధాన కర్తవ్యమని హసీనా వివరించారు. “బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడమే నా లక్ష్యం,” అని ఆమె చెప్పారు.
బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద, తీవ్రవాద శక్తుల ముప్పు పెరుగుతోందని, అది కేవలం ఆ దేశ అంతర్గత సమస్యగా మాత్రమే చూడలేమని హసీనా హెచ్చరించారు. “ఇది తీవ్రమైన ప్రాంతీయ ముప్పు,” అని ఆమె పేర్కొన్నారు. అయితే తిరుగు ప్రయాణానికి సంబంధించిన పూర్తి ప్రణాళికలు ఇంకా ఖరారు కాలేదని ఆమె తెలిపారు.
బంగ్లాదేశ్ లేదా భారత ప్రభుత్వాలతో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక లేదా అనధికారిక చర్చలు జరపలేదని హసీనా స్పష్టం చేశారు. ఆమె పునరాగమనానికి సంబంధించిన చట్టపరమైన, రాజకీయ ప్రక్రియలు ఎలా ముందుకు సాగుతాయన్నది రాబోయే నెలల్లో కీలకంగా మారనుంది.
