బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు వీలుగా కొత్త పాస్‌పోర్టు జారీ చేయాలని ఆమె తరఫు న్యాయవాదులు కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని బంగ్లాదేశ్ తాత్కాలిక హైకమిషనర్ ప్రీతి రెహమాన్‌కు లేఖ రాశారు.
2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఉద్యమం నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆగస్టు 5న ఆమె దేశాన్ని విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి భారత్‌లోనే నివసిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న తన ప్రభుత్వం కూలిపోయి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా స్వదేశానికి తిరిగి రావాలనే ఆకాంక్షను ఆమె బహిరంగంగా వెల్లడించారు.
కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు కోసం విజ్ఞప్తి
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, ఇతర అధికారులు తన పాత పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు (NID)లను రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయని హసీనా తరఫు న్యాయవాదులు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు కొత్త బంగ్లాదేశ్ పాస్‌పోర్టు, NID జారీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
షేక్ హసీనా బంగ్లాదేశ్ పౌరురాలిగా ఉన్న హక్కుల ఆధారంగా దరఖాస్తును త్వరితగతిన పరిశీలించాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాల ప్రకారం ఉన్న బాధ్యతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లే అవకాశం?
కొత్త పాస్‌పోర్టు కోసం చేసిన ఈ విజ్ఞప్తి నేపథ్యంలో హసీనా డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు కొత్త పాస్‌పోర్టు జారీ అవుతుందా? బంగ్లాదేశ్ అధికారులు ఈ అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
భారత్‌లో రెండేళ్లకు పైగా ఉంటున్న హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లాలన్న ప్రయత్నం బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాల్లో మరో కీలక అంశంగా మారింది.
