టిబెట్‌లో మరోసారి భూకంపం.. 4.5 తీవ్రతతో ప్రకంపనలు
చైనాలోని టిబెట్ ప్రాంతాన్ని మరోసారి భూకంపం వణికించింది. గురువారం సంభవించిన శక్తివంతమైన భూకంపంలో 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే.. శనివారం ఉదయం 4.5 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. తాజా ప్రకంపనలతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) వివరాల ప్రకారం.. భూకంపం 31.485 ఉత్తర అక్షాంశం, 93.528 తూర్పు రేఖాంశం వద్ద, భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
గురువారం టిబెట్‌లోని నగ్క్వా నగర పరిధిలోని బాకెన్ కౌంటీ సమీపంలో 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, 76 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. కొండచరియలు విరిగిపడటంతో నేషనల్ హైవే 317లోని ఒక మార్గానికి అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు కూడా కొన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
Also Read- వనాటు దీవుల్లో వరుసగా మూడు భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరిక జారీ!
సహాయక చర్యల్లో భాగంగా చైనా అధికారులు డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు, ఉపగ్రహ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు 12,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితుల కోసం ముందుగా నిర్మించిన ఇళ్లు, గుడారాలు, పడకలు, దుప్పట్లతో సహా సహాయక సామగ్రిని పంపించారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, బాధితులకు తగిన వసతి కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తాజా ప్రకంపనల నేపథ్యంలో ప్రాంతంలోని భూకంప కార్యకలాపాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
