అమెరికాలో భారత విద్యార్థులకు ఊరట; 4 ఏళ్ల వీసా పరిమితి ప్రతిపాదన రద్దు
ఎఫ్-1 విద్యార్థులపై డీహెచ్ఎస్ ప్రతిపాదించిన పరిమితులను యూఎస్ ఫెడరల్ కోర్టు కొట్టివేయడంతో పాత విధానమే కొనసాగనుంది
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కీలక ఊరట లభించింది. ఎఫ్-1 వీసా విద్యార్థుల అడ్మిషన్‌ను 4 ఏళ్లకు పరిమితం చేయాలన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదనను యూఎస్ ఫెడరల్ కోర్టు నవంబర్ 16న రద్దు చేసింది.
యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎఫ్. డెన్నిస్ సేలర్ 4 ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతం అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానం కొనసాగనుంది. ఈ విధానం ప్రకారం ఎఫ్-1 వీసాపై అమెరికాలో చదువుతున్న విద్యార్థులు తమ అకడమిక్ ప్రోగ్రామ్ పూర్తయ్యేంత వరకు దేశంలో ఉండవచ్చు. పీహెచ్‌డీ, లాంగ్ టర్మ్ రీసెర్చ్ వంటి కోర్సులు సాధారణంగా 4 ఏళ్లకంటే ఎక్కువ సమయం పడే అవకాశం ఉండటంతో ఈ తీర్పు విద్యార్థులు, యూనివర్సిటీలు, ఇమ్మిగ్రేషన్ సలహాదారుల దృష్టిలో కీలకంగా మారింది. కోర్సు నిడివి 4 ఏళ్లను దాటిందన్న కారణంతో మాత్రమే వీసా పొడిగింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం తొలగినట్లు విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదన ప్రకారం, విద్యార్థుల అడ్మిషన్ గరిష్టంగా 4 ఏళ్లకే పరిమితం కావాలి. అదనపు సమయం అవసరమైతే విద్యార్థులు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు దరఖాస్తు చేసుకుని పొడిగింపు పొందాలి. కోర్సు పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను 30 రోజులకు తగ్గించాలన్న ప్రతిపాదన కూడా అందులో భాగంగా ఉంది. కోర్టు ఆ ప్రతిపాదనలను నిలిపివేయడంతో కోర్సు పూర్తయ్యాక లేదా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తయ్యాక విద్యార్థులకు లభించే 60 రోజుల గ్రేస్ పీరియడ్ యథాతథంగా కొనసాగనుంది.
తీర్పులో జడ్జి సేలర్ డీహెచ్ఎస్ నిర్ణయ ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతిపాదిత మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలను విభాగం తగిన రీతిలో అంచనా వేయలేదని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల సమాచారాన్ని పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఉన్న సెవిస్ వ్యవస్థను మెరుగుపరచే అవకాశాన్ని డీహెచ్ఎస్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది. “ఎఫ్-1 వీసా ప్రోగ్రామ్‌ను బలహీనపరిచేంత విస్తృత అధికారం డీహెచ్ఎస్‌కు చట్టం ఇవ్వలేదు” అని జడ్జి సేలర్ తన తీర్పులో వ్యాఖ్యానించారు.
HIGHLIGHTS
- నవంబర్ 16న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ప్రతిపాదన రద్దు
- 4 ఏళ్ల వీసా పరిమితి అమల్లోకి రాదు
- 60 రోజుల గ్రేస్ పీరియడ్ యథాతథం
- సీపీటీ ఆంక్షలపై నవంబర్ 17న స్టే
- పీహెచ్‌డీ, రీసెర్చ్ విద్యార్థులకు ప్రధాన ఊరట
ఈ తీర్పు భారత విద్యార్థులపై తక్షణ ప్రభావం చూపనుంది. అమెరికాలో మాస్టర్స్, పీహెచ్‌డీ, రీసెర్చ్ ప్రోగ్రామ్‌లలో చేరే విద్యార్థులు యూనివర్సిటీ మార్పు, కోర్సు పొడిగింపు, రీసెర్చ్ టైమ్‌లైన్ వంటి అకడమిక్ అవసరాల విషయంలో పాత విధానాల ప్రకారమే ముందుకు సాగవచ్చు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, 24 నెలల స్టెమ్ ఓపీటీ పొడిగింపుపైనా పాత నిబంధనలే వర్తిస్తాయి. డీహెచ్ఎస్ ప్రతిపాదించిన అదనపు ఆంక్షలు అమల్లోకి రాకపోవడంతో అమెరికా యూనివర్సిటీల్లో అడ్మిషన్ ప్లానింగ్ చేస్తున్న విద్యార్థులకు అనిశ్చితి కొంతవరకు తగ్గినట్లు ఇమ్మిగ్రేషన్ నిపుణులు పేర్కొన్నారు.
ఇదే సమయంలో కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై విధించిన కొత్త ఆంక్షలకూ మరో యూఎస్ ఫెడరల్ కోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ఆగస్టులో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, డిగ్రీకి తప్పనిసరి అయిన ఇంటర్న్‌షిప్‌లకే సీపీటీ వర్తిస్తుందని, ఐచ్ఛిక ఇంటర్న్‌షిప్‌లకు అది వర్తించదని పేర్కొంది. నవంబర్ 17న జడ్జి జూలియా కోబిక్ ఆ మార్గదర్శకాలపై స్టే ఇచ్చారు. మార్పు ఏకపక్షంగా ఉందన్న వాదనల నేపథ్యంలో తాత్కాలిక ఉపశమనం ఇచ్చినట్లు కోర్టు పేర్కొంది.
రెండు కోర్టు నిర్ణయాలు కలిపి అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ప్రస్తుతానికి స్థిరత్వాన్ని ఇచ్చాయి. అయితే, ఈ తీర్పులపై ట్రంప్ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. తదుపరి న్యాయ ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యార్థులు తమ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఆఫీస్, ఇమ్మిగ్రేషన్ సలహాదారుల సూచనలను అనుసరించాల్సి ఉంటుంది. డీహెచ్ఎస్ లేదా ఎస్ఈవీపీ నుంచి కొత్త మార్గదర్శకాలు వెలువడితే, యూనివర్సిటీలు వాటి ఆధారంగా విద్యార్థులకు మరిన్ని సూచనలు జారీ చేసే అవకాశం ఉంది.
