అమెరికా రక్షణ రంగానికి కొత్త సవాలు
2030 నాటికి మూడు రెట్లు పేట్రియాట్ క్షిపణులను పెంచాలని లక్ష్యం
రేయాన్ కొరతతో అగ్రరాజ్యం సతమతం
ఫ్రాన్స్ నుంచి ప్రత్యేక రేయాన్ రప్పిస్తున్న పెంటగాన్
2028 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా
అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు ఊహించని సమస్య ఎదురైంది. ప్రపంచంలోనే అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన పేట్రియాట్ క్షిపణుల ఉత్పత్తిని భారీగా పెంచాలని భావిస్తున్న పెంటగాన్‌కు ముడిసరుకుల కొరత అడ్డంకిగా మారింది. ముఖ్యంగా ఈ క్షిపణుల తయారీలో కీలకంగా ఉపయోగించే ప్రత్యేక రకం రేయాన్ ఫైబర్ అందుబాటులో లేకపోవడం అమెరికా రక్షణ రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఆయుధ తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ.. ఒక ప్రత్యేకమైన పారిశ్రామిక ముడిసరుకు కొరత కారణంగా ఉత్పత్తి విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అమెరికా తయారు చేసే PAC-3 MSE (Patriot Advanced Capability-3 Missile Segment Enhancement) క్షిపణులు శత్రు దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా శత్రు క్షిపణులను లక్ష్యంగా చేసుకుని గాల్లోనే ధ్వంసం చేసే సామర్థ్యం వీటికి ఉంది. ఈ క్షిపణుల పనితీరులో రాకెట్ మోటార్ కీలకమైన భాగం. దాని పనితీరులో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే పదార్థాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా తయారు చేసిన రేయాన్ ఫైబర్ అవసరమవుతోంది.
Also Read- బీజింగ్‌లో ఆసక్తికర దృశ్యం: ట్రంప్‌కు స్వాగతం పలికి కౌగిలించుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్!
సాధారణంగా దుస్తులు, వస్త్ర పరిశ్రమల్లో ఉపయోగించే రేయాన్‌కు, రక్షణ రంగంలో వినియోగించే ప్రత్యేక రేయాన్‌కు చాలా తేడా ఉంటుంది. దీనిని ప్రత్యేక ప్రక్రియ ద్వారా కార్బన్ ఫైబర్ ఆధారిత ఉష్ణ నిరోధక పదార్థంగా మారుస్తారు. రాకెట్ మోటార్లో ఇంధనం మండినప్పుడు అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో మోటార్ నాజిల్ వంటి కీలక భాగాలు దెబ్బతినకుండా ఈ పదార్థం రక్షణ కల్పిస్తుంది. అందువల్ల దీని సరఫరాలో అంతరాయం ఏర్పడితే క్షిపణుల తయారీ ప్రక్రియపైనా ప్రభావం పడుతుంది.
ఈ ప్రత్యేక రేయాన్ సరఫరా విషయంలో అమెరికాకు ఫ్రాన్స్ కీలక వనరుగా ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన అరియానేగ్రూప్ ఈ రంగంలో ముఖ్యమైన సరఫరాదారుగా వ్యవహరిస్తోంది. అక్కడి నుంచి లభించే ప్రత్యేక ఫైబర్‌ను అమెరికాలోని పార్క్ ఏరోస్పేస్ సంస్థ తదుపరి ప్రక్రియలకు ఉపయోగించి క్షిపణుల తయారీకి అవసరమైన పదార్థంగా అందిస్తోంది. దీంతో అమెరికా రక్షణ పరిశ్రమకు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా ఒక ఆయుధ తయారీ ఈసంస్థకు కొత్త సరఫరాదారును ఎంపిక చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా క్షిపణుల తయారీలో ఉపయోగించే ముడిసరుకుల విషయంలో నాణ్యత, భద్రత, ఉష్ణ నిరోధక సామర్థ్యం వంటి అంశాలను క్షుణ్ణంగా పరీక్షించాల్సి ఉంటుంది. కొత్త సంస్థ నుంచి సరఫరా అయ్యే పదార్థం ఇప్పటికే ఉపయోగిస్తున్న దానితో సమానమైన ప్రమాణాలను కలిగి ఉందని నిరూపించాలి. ఇందుకోసం అనేక పరీక్షలు, సాంకేతిక పరిశీలనలు, ధ్రువీకరణ ప్రక్రియలు అవసరం. ఈ కారణంగా ప్రత్యామ్నాయ సరఫరాదారులను వెంటనే సిద్ధం చేసుకోవడం సాధ్యం కావడం లేదు.
====
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పేట్రియాట్ క్షిపణులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు వైమానిక రక్షణ వ్యవస్థల ప్రాధాన్యాన్ని మరోసారి చాటిచెప్పాయి. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్ల దాడులను ఎదుర్కోవడానికి పేట్రియాట్ వ్యవస్థలను పలు దేశాలు వినియోగిస్తున్నాయి. అయితే వీటిని నిర్వహించడానికి అవసరమైన ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలను నిరంతరం పెంచుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే అమెరికా తన సొంత రక్షణ అవసరాలతోపాటు మిత్రదేశాలకు కూడా ఆయుధాలను సరఫరా చేయాల్సి వస్తోంది. దీంతో అందుబాటులో ఉన్న క్షిపణి నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పేట్రియాట్ క్షిపణుల ఉత్పత్తిని 2030 నాటికి మూడు రెట్లు పెంచాలన్న లక్ష్యంతో పెంటగాన్ ముందుకు సాగుతోంది. అయితే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కేవలం కొత్త యంత్రాలు, అదనపు తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తే సరిపోదు. వాటికి అవసరమైన కీలక ముడిసరుకులు కూడా నిరంతరాయంగా అందుబాటులో ఉండాలి.
రేయాన్ కొరత సమస్యను అధిగమించేందుకు ఫ్రాన్స్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా కొత్త ఉత్పత్తి సదుపాయాలు 2028 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు అమెరికాలోనూ ఈ ప్రత్యేక పదార్థాల తయారీకి సంబంధించిన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నారు. అమెరికాలో కొత్త తయారీ కేంద్రం 2030 ప్రాంతంలో అందుబాటులోకి రావచ్చని అంచనా. అయితే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు సరఫరా కొరతను ఎలా అధిగమించాలన్నది పెంటగాన్ ముందున్న ప్రధాన ప్రశ్నగా మారింది.
