వైట్ హౌస్ రెడ్ అలర్ట్
వైట్‌హౌస్ సమీపాన వరుస భద్రతా ఉల్లంఘనలు
ట్రంప్ నివాసం చుట్టూ ఏం జరుగుతోంది?
అనూహ్యంగా రెండు సంఘటనలు
అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు
బారికేడ్లను దాటుకుని లోపలికి చొచ్చుకెళ్లేందుకు వ్యక్తి ప్రయత్నం
అరగంట పాటు హైఅలర్ట్!
నవంబరు 5న మరో సంఘటనలో అనుమానితుని అరెస్ట్
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతాల్లో ఒకటి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివసించే ఈ భవనం చుట్టూ అడుగడుగునా నిఘా ఉంటుంది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, భద్రతా బలగాలు నిరంతరం పహారా కాస్తుంటాయి. అలాంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఒకేసారి రెండు అనూహ్య ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఒకవైపు కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లడం.. మరోవైపు వ్యక్తి భద్రతా బారికేడ్లను దాటుకుని లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడం.. క్షణాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వైట్‌హౌస్ వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తమై అత్యవసర చర్యలు చేపట్టారు. అధ్యక్ష భవనాన్ని తాత్కాలికంగా లాక్‌డౌన్ చేశారు.
సోమవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో వాషింగ్టన్‌లోని లాఫాయెట్ పార్క్ ఉత్తర భాగంలో ఈ ఘటనల పరంపర మొదలైంది. ఓ వ్యక్తి నడుపుతున్న సిల్వర్ రంగు సెడాన్ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి అక్కడి సమాచార సూచిక బోర్డును ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడున్నవారు ఉలిక్కిపడ్డారు. కారు నుంచి పొగలు వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోల్లో కారు చుట్టూ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, నేషనల్ గార్డ్ సిబ్బంది చేరడం కనిపించింది.
కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించగా అతడు సహకరించలేదు. పైగా అధికారులతో దూకుడుగా వ్యవహరిస్తూ ప్రతిఘటించాడు. దీంతో అక్కడ కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. చివరకు సిబ్బంది అతడిని కిందపడేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కేవలం వాహన ప్రమాదంగా భావించి వదిలేయకుండా, కారులో పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానంతో వాషింగ్టన్ పోలీసుల బాంబు నిర్వీర్య బృందాన్ని కూడా రంగంలోకి దించారు.
ఇదే సమయంలో లాఫాయెట్ పార్క్ వాయవ్య మూలలో మరో వ్యక్తి భద్రతా బారికేడ్లను దాటుకుని లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. సాధారణంగా పర్యాటకులు, సందర్శకులు సంచరించే ప్రాంతంలో ఒక్కసారిగా అతడు పరుగెత్తుకుంటూ బారికేడ్‌ను దూకడంతో అక్కడి భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. అతడిని కూడా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా ఉల్లంఘనలు జరగడంతో అధికారులు పరిస్థితిని తీవ్రంగా పరిగణించారు. ఈ రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా? ముందస్తు ప్రణాళికతోనే ఈ చర్యలకు పాల్పడ్డారా? లేక యాదృచ్ఛికంగా ఒకే సమయంలో జరిగాయా? అన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వైట్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో రహదారులను మూసివేశారు. భద్రతా కారణాలతో వైట్‌హౌస్‌లోని మీడియా ప్రతినిధులను కూడా వెస్ట్ వింగ్‌లోని బ్రీఫింగ్ గదిలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. అధ్యక్షుడు ట్రంప్ ఆ సమయంలో వైట్‌హౌస్‌లోనే ఉన్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్న తర్వాత, తనిఖీలు ముగియడంతో ఆంక్షలను ఎత్తివేశారు. సుమారు అరగంట నుంచి కొద్దిసేపు నిలిచిపోయిన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కారుతో దూసుకొచ్చిన వ్యక్తి, బారికేడ్ దాటిన మరో వ్యక్తి ఎవరన్నది, వారి చర్యల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది మాత్రం ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ రెండు ఘటనలు పరస్పరం సంబంధం లేనివి కావచ్చని కూడా అధికారులు భావిస్తున్నప్పటికీ, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని స్పష్టం చేశారు. కారులో ఎలాంటి ప్రమాదకర పదార్థాలు ఉన్నాయా అన్న అనుమానంతో నిర్వహించిన తనిఖీల్లోనూ పేలుడు పదార్థాల ఆనవాళ్లు లభించకపోవటంతో భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
=====
కొద్ది రోజుల ముందఉ అధ్యక్షుడి నివాసానికి సమీపంలో మరో సంఘటన చోటుచేసుకుంది. నవంబర్ 5వ తేదీ రాత్రి జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ అనుమానాస్పద వాహనంలో భారీగా తుపాకులు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు గుర్తించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు సాధారణ వ్యక్తి కాదని, అధ్యక్షుడిని హతమార్చాలనే ఆలోచనతో వాషింగ్టన్‌కు వచ్చినట్లు విచారణలో వెల్లడైందని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ఆ వ్యక్తికి ఆంగ్ల భాషపై పరిమిత అవగాహన ఉండటంతో అధికారులు గూగుల్ ట్రాన్స్‌లేట్ సహాయంతో అతడితో మాట్లాడారు. ఈ సందర్భంగా తనను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి నుంచి తుపాకీని లాక్కున్నానని, అందుకే అది తన వద్ద ఉందని అతడు చెప్పినట్లు కోర్టు దర్యాప్తు పత్రాల్లో పేర్కొన్నారు. అనంతరం వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అధికారులకు దిమ్మతిరిగే విషయం బయటపడింది. అందులో ఏఆర్-15 తరహా రైఫిల్, ఎంఏసీ-10 తుపాకీ, గ్లోక్ 43ఎక్స్ హ్యాండ్‌గన్‌తో పాటు డజన్ల కొద్దీ తూటాలు లభించాయి. అంతేకాదు, అతడు ఉపయోగిస్తున్న వాహనం కూడా దొంగిలించబడినదిగా తేలింది.
ఇలా కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వైట్‌హౌస్ పరిసరాల్లో మూడు భద్రతాపరమైన ఘటనలు వెలుగులోకి రావడం అమెరికా భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేసింది. ఈ ఘటనలన్నింటికీ పరస్పర సంబంధం ఉందనేందుకు ఇప్పటివరకు ఆధారాలు లేవు. అయినప్పటికీ, వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు వైట్‌హౌస్ భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దర్యాప్తు పూర్తయితేనే అసలు విషయం బయటపడుతుంది అప్పటివరకు అమెరికా అధ్యక్ష భవనం చుట్టూ భద్రతా నిఘా మరింత కఠినంగా కొనసాగనుంది.
