యూనస్ ఇంటికి నిప్పు. బంగ్లాదేశ్‌లో మళ్లీ భగ్గుమన్న రాజకీయ కక్షలు
బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించడం.. ఆమె మద్దతుదారులు ఆందోళనలకు సిద్ధమవడం.. మరోవైపు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో దేశవ్యాప్తంగా అలజడి మొదలైంది. ఈ పరిణామాల మధ్య మాజీ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ కుటుంబానికి చెందిన చిట్టగాంగ్‌లోని పూర్వీకుల ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది.
నవంబర్ 18 అర్ధరాత్రి సమయంలో చిట్టగాంగ్‌లోని పంచలైష్ ప్రాంతంలో ఉన్న యూనస్ కుటుంబ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. పోలీసులు వెంటనే స్పందించి మంటలను ఆర్పారు. ఆ గది గత పదిహేనేళ్లుగా ఖాళీగానే ఉందని స్థానిక పోలీసులు వెల్లడించారు. పాత ఫర్నిచర్, దుస్తులు మంటల్లో చిక్కుకున్నట్లు చెబుతున్నారు . ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడా? ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదే సమయంలో యూనస్ స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ కార్యాలయాలపైనా దాడులు సాగుతున్నాయి.. నవంబర్ 10 నుంచి కనీసం 37 కార్యాలయాలకు నిప్పు పెట్టటం లేదా వాటి అందుకు ప్రయత్నించటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దేశంలోని 28 జిల్లాల్లో బాంబు పేలుళ్లు, వాహనాల దహనం, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు నమోదయ్యాయి.
Also Read- అమెరికా పేట్రియాట్ మిస్సైల్ ఉత్పత్తికి రేయాన్ కొరత సవాలు
2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయిన షేక్ హసీనా అప్పటి నుంచి భారత్‌లో ఉంటున్నారు. అయితే డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ఆమె ప్రకటించారు. ఇందుకోసం కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు పత్రాల కోసం దరఖాస్తు చేయగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. హసీనాను భారత్ నుంచి అప్పగించాలని కూడా కోరుతోంది.
మరోవైపు హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది. హసీనా తిరిగి రావాలన్న డిమాండ్‌తో ఆ పార్టీ మద్దతుదారులు నవంబర్ 19న దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేసిన ప్రభుత్వం పారామిలటరీ బలగాలను రంగంలోకి దించింది. ఢాకాలో ఒక్కరోజులోనే వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పులు కనిపిస్తున్నాయన్న చర్చ ఉంది. చైనా, పాకిస్థాన్లతో సంబంధాలు బలపడటం.. భారత్‌తో సంబంధాల్లో ఒడిదుడుకులు రావడం న్యూఢిల్లీకి ఆందోళన కలిగించే అంశాలుగా మారాయి. అయితే యూనస్ ఇంటి వద్ద జరిగిన అగ్నిప్రమాదానికి ఈ అంతర్జాతీయ పరిణామాలకు ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పలేం. కాని దీనిని ప్రాధాన్య అంశంగానేచూడాలి.
ఒకప్పుడు హసీనా పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం.. ఇప్పుడు ఆమె మద్దతుదారులు, ప్రస్తుత అధికార పక్షం మధ్య రాజకీయ ఘర్షణలకు దారితీస్తోంది. ప్రభుత్వంపై అసంతృప్తి, ప్రతీకార రాజకీయాలు, వీధి హింస బంగ్లాదేశ్‌ను మరోసారి అస్థిరత దిశగా నడిపిస్తున్నాయి. యూనస్ కుటుంబ ఇంటి వద్ద మంటలు చెలరేగడం ఈ ఉద్రిక్తతలకు మరో ఉదాహరణగా నిలిచింది. అసలు ఈ ఘటన వెనుక ఎవరున్నారు? ఇది ప్రమాదమా, కుట్రపూరిత దాడా? పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
