పొరపాటున యూపీఐలో డబ్బు పంపితే వెంటనే ఫిర్యాదు కీలకం
లావాదేవీ వివరాలు భద్రపరచి యాప్, బ్యాంక్, అవసరమైతే అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించాలని నిపుణుల సూచన
డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో యూపీఐ ద్వారా పొరపాటున వేరే వ్యక్తికి డబ్బు పంపినప్పుడు వెంటనే స్పందించడం కీలకమని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. లావాదేవీ ఐడీ, యూటీఆర్ నంబర్, తేదీ, యూపీఐ ఐడీ ఆధారంగా ఫిర్యాదు ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించాయి.
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లో లావాదేవీ హిస్టరీలోకి వెళ్లి ‘హెల్ప్’ లేదా ‘రైజ్ డిస్ప్యూట్’ ద్వారా ముందుగా ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత ఖాతా ఉన్న బ్యాంకు శాఖ లేదా కస్టమర్ కేర్‌కు సమాచారం ఇవ్వాలి. బ్యాంకు యూటీఆర్ ఆధారంగా డబ్బు అందుకున్న బ్యాంకును సంప్రదించి రికవరీ ప్రక్రియ చేపడుతుంది. అయితే అవతలి ఖాతాదారుడి సమ్మతి లేకుండా బ్యాంకు నేరుగా నగదు వెనక్కి తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.
HIGHLIGHTS
- మొదటి కొన్ని నిమిషాలు కీలకం
- యూటీఆర్ నంబర్ తప్పనిసరి ఆధారం
- ముందుగా యాప్‌లోనే ఫిర్యాదు చేయాలి
- 30 రోజుల్లో స్పందన లేకపోతే అంబుడ్స్‌మన్ మార్గం
అవతలి వ్యక్తి డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే చట్టపరమైన మార్గాలు అందుబాటులో ఉంటాయి. భారత కాంట్రాక్ట్ చట్టం 1872లోని సెక్షన్ 72 ప్రకారం పొరపాటున అందిన సొమ్మును తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. బ్యాంకు లేదా యాప్ ద్వారా పరిష్కారం రాకపోతే ఎన్‌పీసీఐ పోర్టల్‌లో యూపీఐ కంప్లయింట్ నమోదు చేయవచ్చు. బ్యాంకుకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన తర్వాత 30 రోజుల్లో స్పందన లేకపోతే ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఫిర్యాదు చేయవచ్చు.
సైబర్ మోసాల సందర్భంలో మాత్రమే 1930 హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించాలి. స్వయంగా తప్పు యూపీఐ ఐడీకి నగదు పంపిన లావాదేవీని సాధారణ బ్యాంకింగ్ వివాదంగా పరిగణిస్తారు. కొత్తవారికి పెద్ద మొత్తం పంపే ముందు చిన్న మొత్తం పంపి నిర్ధారించుకోవడం, స్క్రీన్‌పై కనిపించే లబ్ధిదారుడి పేరును పరిశీలించడం తదుపరి జాగ్రత్తలుగా అధికారులు సూచిస్తున్నారు.
Also Read- బులంద్‌షహర్‌లో 69 ఏళ్ల వృద్ధుడి ఫైర్ స్టంట్ వైరల్
