దీపావళి వచ్చిందంటే ప్రతి ఇంటా వెలుగుల సందడి, పటాకుల శబ్దాలు మిన్నంటుతాయి. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఈ పండుగను ఆస్వాదించే విధానం, ఆలోచనా ధోరణి పూర్తిగా మారుతుందంటున్నారు ప్రముఖ నటుడు అడివి శేష్. చిన్నప్పుడు ధ్వని, వెలుగుల కోలాహలమే పండుగ అనుకునేవాళ్లమని, కానీ పెద్దయ్యాక అసలైన పండుగ ఆనందం మన చుట్టూ ఉండే మనుషుల్లోనే ఉందనే నిజం బోధపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీపావళి జ్ఞాపకాలను, తన మారుతున్న పండుగ శైలిని అడివి శేష్ పంచుకున్నారు.
చిన్నప్పటి పండుగ వేరు.. ఇప్పటి అనుభూతి వేరు!
"చిన్నతనంలో దీపావళి అంటే బడి సెలవులు, నోరూరించే పిండివంటలు, కొత్త బట్టలు, చుట్టూ జరిగే హంగామా మాత్రమే గుర్తొచ్చేవి. పండుగను ఎందుకు జరుపుకుంటున్నాం? దాని వెనుక అంతరార్థం ఏమిటి? అని చిన్నప్పుడు పెద్దగా ఆలోచించేవాళ్లం కాదు. కానీ వయసు పెరిగే కొద్దీ ఆలోచనా విధానం మారుతుంది. ఇప్పుడు నా దృష్టిలో పండుగ అంటే మనకిష్టమైన కుటుంబ సభ్యులంతా ఒకే చోట సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటమే అసలైన విలాసం (Real Luxury)" అని అడివి శేష్ వ్యాఖ్యానించారు.
జీవితంలో ప్రొఫెషనల్ పనుల వల్ల ఒక్కొక్కరం ఒక్కో చోట బిజీగా మారిపోతుంటామని, ఇలాంటి సమయాల్లో కుటుంబమంతా ఒకే చోటకు చేరి సరదాగా సమయాన్ని గడపడం ఎంతో విలువైన క్షణాలుగా మారుతాయని ఆయన చెప్పారు.
మూగజీవాల పట్ల బాధ్యత.. టపాసులకు స్వస్తి!
టపాసుల శబ్దాలు మానవులకే కాకుండా మూగజీవాలకు తీవ్ర భయాందోళనలను కలిగిస్తాయని శేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్ నిమల్స్ మాత్రమే కాకుండా బయట ఉండే జంతువులు కూడా బాణసంచా శబ్దాలకు ఉక్కిరిబిక్కిరి అవుతాయన్నారు.
"కాలుష్యం, శబ్దాల వల్ల మన పెంపుడు జంతువులే కాదు, బయటి వీధుల్లో ఉండే మూగజీవాలు కూడా చాలా భయపడతాయి. అందుకే నేను టపాసులు కాల్చడం మానేసి, ఇల్లంతా దీపాలు వెలిగించి శాంతియుతంగా పండుగ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. దీపాలు వెలిగించినా వేడుకల ఉత్సాహం ఏ మాత్రం తగ్గదు, జరుపుకునే విధానం మాత్రమే మారుతుంది" అని పర్యావరణహిత పండుగ సందేశాన్ని ఇచ్చారు.
కెరీర్ విశేషాలు
విలక్షణ పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్, ఇటీవల 'డెకాయిట్' (Dacoit) చిత్రంతో అలరించారు. ప్రస్తుతం ఆయన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'గూఢచారి 2' (G2) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీ నిర్మితితో రూపొందుతోంది.
