పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ‘హ్యాపీ రెబల్స్ డే’ పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.
విడుదలైన వీడియోలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను చూపించారు. చివర్లో ఆయన చెప్పిన “అరే ఓ అంగ్రేజ్.. నీ రక్తంతో తడిపి.. నా దేశానికి స్వాతంత్ర్యాన్ని తెస్తా” అనే డైలాగ్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
స్వాతంత్ర్య పోరాట నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. విడుదల తేదీ ప్రకటన, ప్రత్యేక వీడియోతో ‘ఫౌజీ’పై అంచనాలు మరింత పెరిగాయి.