99TV News

    Ranbir Kapoor Reveals Directorial Plans | Retires as Actor in 10 Years

    Ranbir Kapoor Reveals Directorial Plans | Retires as Actor in 10 Years

    నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’ (Ramayana) చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడిగా మరో పదేళ్లు మాత్రమే కొనసాగుతానని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో దర్శకత్వంపై దృష్టి పెడతానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

    దర్శకత్వం వహించాలనే ఆలోచనతో ఇప్పటికే ఒక కథ రాయడం ప్రారంభించినట్లు రణ్‌బీర్ వెల్లడించారు. త్వరలోనే మెగాఫోన్ పట్టుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    ‘‘రెండు మూడేళ్లలో డైరెక్టర్‌గా తొలి అడుగు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దర్శకుడిగా ఓ కథను తెరపై ఆవిష్కరించడం ఎంతో గొప్ప అనుభూతినిస్తుంది. నా తొలి చిత్రం ఏ జానర్‌లో ఉంటుందో ఇప్పుడే చెప్పలేను. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఇట్స్‌ ఏ వండర్‌ఫుల్‌ లైఫ్‌’, రాజ్‌కుమార్‌ హిరాణీ సినిమాల తరహాలో అందరికీ నచ్చే కుటుంబ కథాచిత్రాన్ని రూపొందించాలని ఉంది. నేను సంవత్సరంలో 100-125 రోజులు మాత్రమే పని చేస్తాను. కాబట్టి కథలు రాయడానికి నాకు చాలా సమయం ఉంటుంది’’ అని రణ్‌బీర్ తెలిపారు.

    తనను తాను హీరోగా పెట్టుకుని సినిమా తీసే ఆలోచన లేదని స్పష్టం చేసిన రణ్‌బీర్, ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాతే దర్శకత్వం వైపు వెళ్తానని వివరించారు. ‘బ్రహ్మాస్త్ర 2’, ‘యానిమల్‌ 2’, ‘రామాయణ: పార్ట్‌ 2’ చిత్రాలను పూర్తి చేసి, రాబోయే రెండుమూడేళ్లలో తన తొలి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తానని వెల్లడించారు.

    సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్.. సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్‌ అండ్‌ వార్‌’ (Love & War) లో అలియా భట్, విక్కీ కౌశల్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 21న విడుదల కానుంది.