దీపావళి వేడుకల పేరుతో అర్ధరాత్రి దాటినా భారీ శబ్దాలతో టపాసులు కాల్చడంపై నటి రేణు దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పండుగను ఆనందంగా జరుపుకోవడంలో తప్పులేదని, అయితే ఇతరులకు ఇబ్బంది కలిగించేలా శబ్ద కాలుష్యాన్ని పెంచడం సరికాదని ఆమె హితవు పలికారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
‘ఏమైనా మాట్లాడితే హిందూ వ్యతిరేకి అంటారు’
దీపావళి రోజున టపాసుల గురించి మాట్లాడితే తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారనే ఉద్దేశంతో మౌనంగా ఉన్నానని రేణు దేశాయ్ తెలిపారు. అయితే పండుగ ముగిసిన తర్వాత కూడా రాత్రి 11 గంటల సమయంలో భారీ శబ్దాలు వచ్చే టపాసులు కాల్చడం ఏమిటని ప్రశ్నించారు. ఇతరుల ఇబ్బందులను పట్టించుకోకుండా తమ ఆనందమే ముఖ్యమని భావించడం సరికాదని వ్యాఖ్యానించారు.
వృద్ధులు, చిన్నారుల ఇబ్బందులను గుర్తించాలి
టపాసుల శబ్దాల వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆమె గుర్తుచేశారు. పండుగను దీపాల వేడుకగా జరుపుకోవాలే తప్ప శబ్దాల పోటీగా మార్చకూడదని సూచించారు. వీలైనంత వరకు రాత్రి 10 గంటల్లోపే టపాసులు కాల్చడం ముగించి, ఆ తర్వాత ఇతరులకు ప్రశాంతత కల్పించాలని కోరారు.
Also Read :- విడాకుల ప్రకటనకు ముందే ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పిన అన్నా కొణిదెల.. అప్పట్లోనే మొదలైన చర్చ!
కాలుష్యంపై కూడా స్పందన
కాలుష్యం గురించి మాట్లాడటం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు. ఏడాదిలో 364 రోజుల పాటు వాహనాలు, పరిశ్రమల కారణంగా కాలుష్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏదేమైనా, తమ ఆనందం కోసం ఇతరులను ఇబ్బందులకు గురిచేయకూడదని, తోటి మనుషుల పట్ల కొంతైనా దయ చూపించాలని ఆమె తన పోస్టులో విజ్ఞప్తి చేశారు.
Highlights
- అర్ధరాత్రి దాటినా టపాసులు కాల్చడంపై రేణు దేశాయ్ ఆగ్రహం.
- దీపావళి రోజు మాట్లాడితే హిందూ వ్యతిరేకి అంటారనే మౌనంగా ఉన్నానని వ్యాఖ్య.
- వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారి ఇబ్బందులను గుర్తించాలని సూచన.
- రాత్రి 10 గంటల్లోపే టపాసులు కాల్చడం ముగించాలని విజ్ఞప్తి.
- ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించవద్దని హితవు.
