రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త జేమ్స్ బాండ్‌గా ఎంపిక
డేనియల్ క్రెయిగ్ వారసుడిగా ఏజెంట్ 007 పాత్రలో ప్యాటిన్సన్ నటించనున్నట్లు అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ప్రకటించింది
ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ కొత్త చిత్రంలో ఏజెంట్ 007గా నటించనున్నట్లు అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ మంగళవారం ప్రకటించింది. డేనియల్ క్రెయిగ్ తర్వాత బాండ్ పాత్రను చేపట్టే 7వ నటుడిగా ప్యాటిన్సన్ నిలిచారు.
అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మిస్తున్న 26వ జేమ్స్ బాండ్ రీబూట్ చిత్రానికి డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వం వహించనున్నారు. పీకీ బ్లైండర్స్ ఫేమ్ స్టీవెన్ నైట్ కథ అందించగా, ఎమీ పాస్కల్, డేవిడ్ హేమన్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. అధికారిక ప్రకటన తర్వాత బాండ్ ట్రేడ్‌మార్క్ టక్సేడో సూట్‌లో ప్యాటిన్సన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాత్ర కోసం జోష్ ఓ'కానర్, కల్లమ్ టర్నర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
“జేమ్స్ బాండ్ వంటి లెజెండరీ పాత్రను నాకు అప్పగించడం నా జీవితంలో గొప్ప గౌరవం,” అని నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రకటన అనంతరం తెలిపారు. “డెనిస్ విల్లెనెవ్, నిర్మాణ సంస్థ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను,” అని ఆయన అన్నారు. దర్శకుడు డెనిస్ విల్లెనెవ్, “బాండ్ పాత్రకు ప్యాటిన్సన్ సరికొత్త శైలి, తీవ్రత తీసుకువస్తారు,” అని పేర్కొన్నారు. నిర్మాణ బృందం ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీకి కొత్త ఆరంభంగా అభివర్ణించింది.
HIGHLIGHTS
- రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త ఏజెంట్ 007
- 26వ జేమ్స్ బాండ్ చిత్రానికి డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వం
- స్టీవెన్ నైట్ కథ అందిస్తున్నారు
- ప్యాటిన్సన్ బాండ్‌గా కనిపించే 7వ నటుడు
సీన్ కానరీ, జార్జ్ లాజెన్‌బై, రోజర్ మూర్, తిమోతీ డాల్టన్, పియర్స్ బ్రాస్నన్, డేనియల్ క్రెయిగ్ తర్వాత ప్యాటిన్సన్ ఈ పాత్రలోకి వస్తున్నారు. 2025లో అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ హక్కులను సుమారు 1 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుంది. దాంతో కొత్త బాండ్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
హ్యారీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్, ట్విలైట్ చిత్రాలతో ప్యాటిన్సన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2022లో ది బ్యాట్‌మ్యాన్‌లో బ్రూస్ వేన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2026లో ది ఒడిస్సీ చిత్రంలో కనిపించిన ఆయన, 2028లో విడుదల కానున్న ది బ్యాట్‌మ్యాన్ 2లోనూ నటించనున్నారు. బాండ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్, విడుదల తేదీని స్టూడియో త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Also Read-‘ కల్కి 2’ నిజాం రైట్స్‌పై ₹108 కోట్ల డీల్!!!
