99TV News

    50 ఏళ్ల మహిళగా నన్ను నేను గుర్తుపట్టలేకపోయా: నటి వామికా గబ్బీ | Wamiqa Gabbi Prahaar Movie

    50 ఏళ్ల మహిళగా నన్ను నేను గుర్తుపట్టలేకపోయా: నటి వామికా గబ్బీ | Wamiqa Gabbi Prahaar Movie

    హైదరాబాద్:

    30 ఏళ్ల వయసున్న ఓ నటి 50 ఏళ్ల మహిళగా మారి తెరపై కనిపించడం సాధారణ విషయం కాదు. అలాంటి సవాలుతో కూడిన అనుభవాన్నే ఎదుర్కొన్నారు ప్రముఖ నటి వామికా గబ్బీ (Wamiqa Gabbi). ఆమె కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ప్రహార్’ (Prahaar). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరియు సోషల్ మీడియా వేదికగా స్పందించిన వామికా.. ఈ సినిమాలో 50 ఏళ్ల వయసున్న ‘జ్యోతి నికమ్’ అనే పాత్ర కోసం సిద్ధమైన తీరును, మేకప్ వెనుక ఉన్న అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు.

    "అద్దంలో చూసుకుని ఆశ్చర్యపోయా!"

    ‘‘మేకప్ పూర్తయ్యాక తొలిసారి అద్దంలో చూసుకున్నప్పుడు అలాగే చూస్తుండిపోయా. అదొక కొత్త అనుభూతి. ఆ గెటప్‌లో నన్ను నేను అస్సలు గుర్తుపట్టలేకపోయాను. మేకప్ కోసం గంటల తరబడి కూర్చున్నప్పుడు నా రూపంలో వస్తున్న మార్పుల్ని గమనించాను. అప్పుడే ఆ పాత్ర నా మనసుకు బాగా కనెక్ట్ అయింది. సెట్‌లో ఎవరైనా నా ఫొటో తీసి చూపిస్తే తప్ప.. నేను ఇంతలా మారిపోయానా? అనే విషయం నాకు గుర్తుకొచ్చేది కాదు’’ అని వామిక చెప్పుకొచ్చారు. ఈ పాత్ర నటనలో తనకు కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు దక్కిన అరుదైన అవకాశమని ఆనందం వ్యక్తం చేశారు.

    Also Read - ఈ క్రిస్మస్‌కు ‘కింగ్‌’ వర్సెస్ ‘కింగ్‌’.. విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌!

    మొదట్లో భయపడ్డాను కానీ..

    ఈ సినిమా చేయడానికి మొదట్లో కాస్త భయపడ్డానని వామికా గబ్బీ ఒప్పుకున్నారు. "ఈ సినిమా 'వద్దు' అనుకోవడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. కానీ ఎప్పుడైతే స్క్రిప్ట్ పూర్తిగా చదివానో, అప్పుడే ఈ సినిమా కచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నా. వయసుతో పాటు ఒక మహిళ ముఖంలో, శరీరంలో వచ్చే మార్పులు, ఆమె కలలు మారే తీరు.. ఈ చిత్రంలో చాలా కొత్తగా అనిపించాయి. 30 ఏళ్ల వయసున్న మహిళను 50 ఏళ్లు వచ్చేసరికి జీవితం ఎలా మార్చేసిందనేది ఇందులో చూపించారు. జ్యోతి పాత్రలో ఒదిగిపోయే క్రమంలో నా గురించి నేను మరింత కొత్తగా తెలుసుకున్నాను. కొన్ని పాత్రలు మనల్ని ఎప్పటికీ వదిలిపోవు" అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

    నటీనటులు - సాంకేతిక వర్గం

    ఈ విలక్షణ చిత్రాన్ని అవినాశ్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కించగా, దినేశ్ విజన్ నిర్మించారు. రాజ్‌కుమార్‌ రావ్‌, లలిత్‌ ప్రభాకర్‌, జైదీప్‌ అహ్లావత్‌, వామికా గబ్బీ, ఆశిష్‌ విద్యార్థి, సికిందర్‌ ఖేర్‌, నాజర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటోంది.