టోల్ ఎగవేతపై 5 రెట్లు జరిమానా అమలు
ఎంఎల్ఎఫ్ఎఫ్ ప్లాజాల్లో నంబర్ ప్లేట్ దాచినా, ఫాస్టాగ్ గుర్తింపు తప్పించినా మొత్తం 6 రెట్లు వసూలు
జాతీయ రహదారులపై టోల్ ఫీజు ఎగవేతను అరికట్టేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. బ్యారియర్‌లేని ఎంఎల్ఎఫ్ఎఫ్ టోల్ ప్లాజాల్లో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ దాచిన వాహనదారుల నుంచి అసలు టోల్‌తో పాటు 5 రెట్లు జరిమానా వసూలు చేస్తారు.
మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, రూ. 100 టోల్ ఎగవేస్తే రూ. 500 జరిమానా, అసలు టోల్ కలిపి రూ. 600 చెల్లించాలి. ఈ నిబంధన నంబర్ ప్లేట్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా కప్పివేయడం, ఫాస్టాగ్ గుర్తింపును అడ్డుకోవడం, ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్ అంటించకపోవడం వంటి సందర్భాలకు వర్తిస్తుంది.
HIGHLIGHTS
- టోల్ ఎగవేతకు 5 రెట్లు జరిమానా
- అసలు టోల్‌తో కలిపి 6 రెట్లు చెల్లింపు
- ఎంఎల్ఎఫ్ఎఫ్ ప్లాజాల్లో అమలు
- ఏఎన్‌పీఆర్ కెమెరాలు, ఫాస్టాగ్ రీడర్లు వినియోగం
ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ లేక చెల్లింపు విఫలమైతే దాన్ని ఉద్దేశపూర్వక ఎగవేతగా పరిగణించరు. అటువంటి సందర్భాల్లో వాహన యజమానికి ఇ-నోటీస్ పంపుతారు. 72 గంటల్లో చెల్లిస్తే అసలు టోల్ సరిపోతుంది; ఆ తర్వాత రెట్టింపు చెల్లించాలి.
ఎంఎల్ఎఫ్ఎఫ్ వ్యవస్థలో వాహనాలు ఆగాల్సిన అవసరం లేదు. ఏఎన్‌పీఆర్ కెమెరాలు, ఫాస్టాగ్ రీడర్లు ఆటోమేటిక్‌గా టోల్ నమోదు చేస్తాయి. నంబర్ ప్లేట్, ఫాస్టాగ్ కనిపించకపోయినా ఏఐ ఆధారిత వెహికల్ ఫింగర్‌ప్రింటింగ్, వాహన్ డేటాబేస్ ద్వారా యజమానులను గుర్తిస్తారు. గుజరాత్‌లోని చోర్యాసి ప్లాజాతో ప్రారంభమైన ఈ విధానం మరిన్ని ప్లాజాలకు విస్తరించనుంది.
