ఢిల్లీలో హైడ్రామా.. విమానంలోనే సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే అదుపులోకి
జంతర్ మంతర్ నిరసనకు వచ్చిన అభిజీత్ దీప్కేను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు నిర్బంధించారు
జంతర్ మంతర్ వద్ద శనివారం తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను విమానం ల్యాండ్ అయిన వెంటనే ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలను కూడా నిర్బంధించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో ఉదయం నుంచే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీప్కే ప్రయాణించిన ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత పోలీస్ బృందం విమానంలోకి వెళ్లి వారిని అదుపులోకి తీసుకుంది. ఈ దృశ్యాలను దీప్కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమ్ చేశారు. వీడియోలో పోలీసులతో వాగ్వాదం చేస్తూ, “మేం కిందకు దిగే వరకు మీరు ఆగలేరా? బయటకు వచ్చాక అరెస్ట్ చేసుకోండి, మేం భయపడం” అని అభిజీత్ దీప్కే అన్నారు.
అనంతరం ముగ్గురిని ఎయిర్‌పోర్ట్ నుంచి తెలియని ప్రదేశానికి తరలించినట్లు పార్టీ నేతలు చెప్పారు. సీజేపీ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ, శాంతియుత నిరసనను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను ఉపయోగిస్తోందని ఆరోపించింది. “ఇది ప్రభుత్వ నిరంకుశ చర్య. మా నేతల స్వేచ్ఛను హరించారు. వారిని వెంటనే విడుదల చేయాలి” అని సీజేపీ ప్రకటనలో తెలిపింది.
నిరసనకు ముందే ఢిల్లీ పోలీసులు విస్తృత ఆంక్షలు విధించారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ న్యాయవిభాగం అధిపతి రత్నా సింగ్‌లను వారి ఇళ్ల వద్దే గృహనిర్బంధంలో ఉంచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాత్రికి రాత్రే సుమారు 400 మంది అనుమానిత నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు.
HIGHLIGHTS
- అభిజీత్ దీప్కేను విమానంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
- జంతర్ మంతర్ నిరసనకు సీజేపీ పిలుపు
- ఢిల్లీలో 45 మెట్రో స్టేషన్లు మూసివేత
- 20,000 మందికి పైగా భద్రతా సిబ్బంది మోహరింపు
- రాత్రికి రాత్రే సుమారు 400 మంది అదుపులోకి
ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. 45 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. పలు రైళ్లను రద్దు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 20,000 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. ముఖ్య కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ నిరసనకు సరైన సమయంలో అనుమతి కోరలేదని పేర్కొంటూ శుక్రవారమే పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. అనుమతి లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడితే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీస్ అధికారులు తెలిపారు. అయితే సీజేపీ మాత్రం తాము శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నామని, ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని పేర్కొంది.
దీప్కే అదుపులోకి తీసుకున్న ఘటనపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఆయనను ఎక్కడ ఉంచారు, ఏ సెక్షన్ల కింద నిర్బంధించారు అన్న వివరాలపై కుటుంబ సభ్యులు, పార్టీ ప్రతినిధులు పోలీసుల నుంచి స్పష్టత కోరుతున్నారు. కోర్టును ఆశ్రయించే అంశంపై సీజేపీ లీగల్ టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
