99TV News

    డీలిమిటేషన్‌పై కేంద్రం కసరత్తు.. రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు యోచన

    డీలిమిటేషన్‌పై కేంద్రం కసరత్తు.. రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు యోచన

    జనాభాతో సంబంధం లేకుండానే డీలిమిటేషన్‌కు కేంద్రం కసరత్తు

    అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచే ప్రతిపాదనపై కేబినెట్ భేటీ తర్వాత ప్రకటనకు అవకాశం

    దేశంలో నియోజకవర్గాల పునర్విభజనను జనాభా లెక్కలతో ముడిపెట్టకుండా ముందుకు తీసుకెళ్లే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత లోక్‌సభ సీట్లపై 50 శాతం చొప్పున అదనపు స్థానాలు కల్పించే అంశం కేంద్ర కేబినెట్ పరిశీలనకు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

    సాధారణంగా డీలిమిటేషన్‌కు తాజా సెన్సస్ ఆధారంగా ఉంటుంది. అయితే కొత్త జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు ప్రక్రియ వాయిదా పడకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ఎంత ప్రాతినిధ్యం ఉందో అదే నిష్పత్తి కొనసాగిస్తూ, అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్ల పెంపు ఇవ్వడం ద్వారా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య తలెత్తే రాజకీయ వివాదాలను తగ్గించవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

    జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు సీట్ల పునర్విభజనలో నష్టపోతాయన్న ఆందోళనలు దక్షిణాదిలో ఉన్నాయి. తాజా ప్రతిపాదన ఆ అభ్యంతరాలకు సమాధానంగా ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలంటే డీలిమిటేషన్ పూర్తవాల్సి ఉండటంతో ఈ ప్రక్రియకు ప్రాధాన్యం పెరిగింది.

    Also Read- సీఎం విజయ్‌కు న్యాయపరమైన చిక్కులు.. పెరంబూర్ విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ట్రయల్!

    HIGHLIGHTS

    - అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన

    - ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి యథాతథంగా కొనసాగించే యోచన

    - మహిళా రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్ కీలకం

    - నవంబరు 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నవంబరు 30 నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ నవంబరు 30న, రాజ్యసభ డిసెంబరు 2న సమావేశం కానున్నాయి. ఈ సమావేశాల్లో సంబంధిత సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు తెలిపాయి.

    కేబినెట్ ఆమోదం తర్వాతే ప్రతిపాదన పూర్తి రూపం స్పష్టమవుతుంది. సీట్ల పెంపు విధానం, రాజ్యాంగ సవరణ అవసరం, అమలు కాలపట్టికపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది.