కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అధికారుల వినియోగం కోసం కొనుగోలు చేసే స్టాఫ్ కార్ల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ వాహనాల కొనుగోలులో ఎలక్ట్రిక్ కార్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం నవంబర్ 10న కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల గరిష్ఠ నెట్ డీలర్ ధర పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ కార్లకు మాత్రం ఈ పరిమితిని రూ.10 లక్షలుగా నిర్ణయించారు. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఉన్న ధర పరిమితితో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న పెట్రోల్, డీజిల్ కార్లను తొలగించి వాటి స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే సమయంలో సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లనే సమకూర్చుకోవాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల అవసరాల కోసం అద్దెకు తీసుకునే వాహనాల్లోనూ ఈవీలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది.
అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు లేదా వినియోగం సాధ్యం కాకపోతే పెట్రోల్, డీజిల్ లేదా హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేసేందుకు మినహాయింపు కోరవచ్చు. ఇందుకోసం తగిన కారణాలతో ప్రతిపాదనను వ్యయ విభాగానికి పంపాలి. సంబంధిత శాఖ కార్యదర్శి ఆమోదం, ఆర్థిక సలహాదారు సమ్మతి తప్పనిసరిగా ఉండాలి. ప్రతిపాదనను పరిశీలించిన తర్వాతే మినహాయింపుపై నిర్ణయం తీసుకుంటారు.
ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ వాహనాల వినియోగంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాహనాల కొనుగోలు ప్రక్రియ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ (GFR) 2017 నిబంధనలకు అనుగుణంగా కొనసాగనుంది.
