ఢిల్లీలో అక్టోబర్ 16న తిరంగా ర్యాలీకి సీజేపీ పిలుపు
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో అక్టోబర్ 16న త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించనున్నట్లు కాక్‌రొచ్ జంతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు జాతీయ జెండాలతో ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా జాతీయ జెండాను ఎగురవేసినందుకే జైలుకు పంపించారని డిప్కే ఆరోపించారు. జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం నేరం కాదని నిరూపించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఢిల్లీకి రాలేనివారు తమ నగరాల్లోనూ తిరంగా ర్యాలీలు నిర్వహించాలని కోరారు.
ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇద్దరు నేతలు
సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అక్టోబర్ 14న ఢిల్లీలోని ఒక న్యాయస్థానం ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్దకు వెళ్లిన సమయంలో తాళం వేసిన గేట్లను దాటి లోపలికి ప్రవేశించారనే ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. జంతర్ మంతర్ అప్పటికే నిరసనలకు గుర్తించిన ప్రదేశాల జాబితా నుంచి తొలగించబడింది.
ఈ ఘటనలో వారితో పాటు ఉన్న అజింక్య షిండే రూ.5,000 బాండ్ సమర్పించిన అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఏడాది పాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనకూడదనే షరతు విధించారు.
మరోవైపు, సీజేపీ వ్యవస్థాపకుడు డిప్కే కూడా తనను అరెస్టు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం కొనసాగిస్తానని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్టోబర్ 16న జరగనున్న ర్యాలీపై ఆసక్తి నెలకొంది.
Also Read- సుప్రీంకోర్టులో నేడు ఎస్‌ఐఆర్ పిటిషన్ల విచారణ.. ఢిల్లీ నిరసనలపై పోలీసు చర్యలకూ సవాల్
