2 MLAs Among 6 Injured | సీఎన్జీ సిలిండర్ పేలడంతో ఎస్‌యూవీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా ఆరుగురికి గాయాలు
న్యూఢిల్లీలో సీఎన్జీ సిలిండర్ పేలడంతో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి వెళ్లి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఐటీవో ప్రాంతంలో ప్రమాదం
ఆదివారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఢిల్లీలోని రద్దీగా ఉండే ఐటీవో ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారులోని సీఎన్జీ సిలిండర్ పేలడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.
అదుపుతప్పిన కారు.. పీడబ్ల్యూడీ కార్యాలయం సమీపంలోని డివైడర్‌పైకి దూసుకెళ్లి అవతలి వైపు వెళ్లింది. అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న ఇన్నోవా ఎస్‌యూవీని బలంగా ఢీకొట్టింది.
ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు
ప్రమాద సమయంలో ఇన్నోవా ఎస్‌యూవీలో కిరారీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ ఝా, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే అభయ్ పటేల్ ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఎమ్మెల్యేలు గాయపడ్డారు.
ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న ఇన్నోవాపై ‘కర్ణాటక ప్రభుత్వం’ అని బోర్డు ఉన్నట్లు సమాచారం. ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో వాహనంలోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలు
స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న 32 ఏళ్ల అశుతోష్ పాండే, ఆయన భార్య, ఇద్దరు చిన్నారులు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారికి కూడా వైద్య చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఆరుగురినీ ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు.
నిలకడగా ఉన్న ఆరుగురి పరిస్థితి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ ప్రమాదం కారణంగా ఐటీవో క్రాసింగ్ వద్ద కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
