99TV News

    Delhi వాహన ఆంక్షలు: నవంబర్ 1 నుంచి BS-VI నిబంధన

    Delhi లో నవంబర్ 1 నుంచి BS-VI కాని బయటి వాహనాల ప్రవేశంపై ఆంక్షలు

    న్యూఢిల్లీ: శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. నవంబర్‌ 1, 2026 నుంచి ఢిల్లీలోకి వచ్చే ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్‌ అయిన, BS-VI ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలపై ఆంక్షలు విధించనున్నట్లు వెల్లడించింది. అయితే CNG, LNG, ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.

    కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా నవంబర్‌ 1 నుంచి జనవరి 31 వరకు దుమ్ము ఉత్పత్తి చేసే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ పనులపై నిషేధం అమల్లో ఉంటుంది. డిసెంబర్‌ 10 నుంచి జనవరి 20 వరకు నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించనున్నారు.

    ప్రైవేట్‌ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు నవంబర్‌ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అధీకృత పార్కింగ్‌ కేంద్రాల్లో పార్కింగ్‌ ఛార్జీలను రెట్టింపు చేయనున్నారు. DMRC నిర్వహించే పార్కింగ్‌ కేంద్రాలకు మినహాయింపు ఉంటుంది.

    అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో పనిచేయనున్నారు. కార్యాలయాల సమయాల్లోనూ మార్పులు చేయనున్నారు.

    కాలుష్య పర్యవేక్షణ కోసం మానిటరింగ్‌ స్టేషన్ల సంఖ్యను 47 నుంచి 60కి పెంచడంతో పాటు, AI ఆధారిత కమాండ్‌ సెంటర్‌, 334 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.