17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్‌కు ఈసీఐ ఆదేశాలు
తెలుగు రాష్ట్రాలు సహా సర్ కొనసాగుతున్న ప్రాంతాల షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణపై కొనసాగుతున్న వివాదాల మధ్య భారత ఎన్నికల సంఘం గురువారం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ చేపట్టాలని ఆదేశించింది. అర్హత తేదీని 2027 జనవరి 1గా నిర్ణయించి, ముసాయిదా జాబితా నుంచి తుది జాబితా వరకు షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, తమిళనాడు సహా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ సవరణ చేపడతారు. నవంబర్ 12న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించి, అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన అనంతరం 2027 జనవరి 4న తుది జాబితాను విడుదల చేస్తారు. కొత్తగా 18 ఏళ్లు పూర్తిచేసుకునే యువతతో పాటు, సాంకేతిక లేదా నమోదు లోపాల కారణంగా జాబితాలో పేర్లు చేరని అర్హులైన పౌరులను చేర్చడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని ఎన్నికల సంఘం తెలిపింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ప్రతిపక్షాల అభ్యంతరాలు పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం వెలువడింది. ఫారం-6తో పాటు అదనపు డిక్లరేషన్ సమర్పించాలన్న నిబంధన, దరఖాస్తుదారుల తల్లిదండ్రుల వివరాలను పూర్వపు జాబితాలతో అనుసంధానం చేయాలన్న ప్రక్రియపై వివిధ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనలు ఓటర్లకు ఇబ్బందులు కలిగిస్తాయని, పెద్దఎత్తున పేర్లు తొలగించబడే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే అర్హులైన ప్రతి ఒక్కరిని నమోదు చేయాలనే లక్ష్యంతోనే ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది.
HIGHLIGHTS
- 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఎస్ఆర్కు ఆదేశాలు
- అర్హత తేదీ 2027 జనవరి 1గా నిర్ణయం
- ముసాయిదా జాబితా నవంబర్ 12న విడుదల
- తుది ఓటర్ల జాబితా 2027 జనవరి 4న ప్రచురణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ సహా సర్ కొనసాగుతున్న లేదా ఇటీవల పూర్తయిన రాష్ట్రాలకు స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు సర్ ప్రారంభం కాని హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు కూడా తగిన సమయంలో షెడ్యూల్ వెల్లడిస్తామని తెలిపింది. సెప్టెంబర్ 29న ఇచ్చిన ఆదేశాల మేరకు అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు సూచించినట్లు ఈసీఐ గుర్తుచేసింది.
ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో 2027 ఫిబ్రవరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా ఓటర్ల జాబితా సవరణకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. తుది జాబితా ఆధారంగా ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల సర్దుబాట్లు, ఓటర్ల గుర్తింపు ప్రక్రియలు ముందుకు సాగనున్నాయి. రాబోయే వారాల్లో ముసాయిదా జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన దశలు కీలకంగా మారనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్‌పై ఎన్నికల సంఘం తదుపరి ప్రకటన కోసం రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఎదురుచూస్తోంది.
