భారత ఎన్నికల కమిషన్ ప్రస్తుతం తీవ్ర వివాదాల మధ్య చిక్కుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న కీలక నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి – గత 10 నెలల్లో కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు నమోదు చేశారని వార్తలొచ్చాయి. ఈ కథనం దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు సీఈసీని తొలగించాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
వివాదం ప్రధానంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ.. సర్ చుట్టూ తిరుగుతోంది. ఈ ప్రక్రియలో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించారు. కమిషనర్లు సంధు, జోషి లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాలను సీఈసీ పట్టించుకోలేదని సమాచారం. ఏ అంశాల్లో వివాదం తలెత్తిందో చూద్దాం.
ఫారం 6 (కొత్త ఓటర్ల నమోదు ఫారం)లో చేసిన మార్పులు: ఇందులో కొత్త డిక్లరేషన్ జోడించారు. ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టార్స్ రూల్స్ 1960 ప్రకారం చట్టపరమైన ఫారం. ప్రభుత్వ నోటిఫికేషన్ లేకుండా మార్చడం “అనధికారికం, చట్టవిరుద్ధం” అని వారు పేర్కొన్నారు.
ఎలక్టోరల్ రోల్ సాఫ్ట్వేర్ ను కేంద్రీకరించడం: రాష్ట్ర స్థాయి అధికారుల యాక్సెస్‌ను పరిమితం చేసి, ఢిల్లీలోని ఐటీ విభాగం నియంత్రణలో ఉంచడం.
ఓటర్ల పేర్లు తొలగింపు, పునరుద్ధరణ, అప్పీళ్లు వంటి నిర్ణయాలు తమకు తెలియకుండానే తీసుకోవడం.
పని విభజన మార్పులు ఐటీ విభాగం పర్యవేక్షణను తగ్గించే ఆర్డర్లపై కూడా అభ్యంతరాలు ఇందులో ఉన్నాయి.
ఈ అభ్యంతరాలు నవంబర్ 2025 నుంచి ఆగస్టు 2026 వరకు నమోదయ్యాయి. ఒకే రోజున నాలుగు సార్లు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. క్యాబినెట్ సెక్రటరీకి కూడా లేఖలు రాశారు.
ఎ న్నికల కమిషన్ మాత్రం ఈ నివేదికను తిరస్కరిస్తూ, “అన్ని నిర్ణయాలు .. ఎస్ఐఆర్ సహా ఏకగ్రీవంగా, ముగ్గురు కమిషనర్ల ఆమోదంతోనే తీసుకున్నాం. భిన్నాభిప్రాయాలు సాధారణం” అని స్పష్టం చేసింది.
ఎన్నికల కమిషన్ తీరును ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. ఓట్ చోరీ అనేది ప్రజలపై నేరం రాజ్యాంగంపై దాడి. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈసీ కలిసి దేశద్రోహం చేశారు అని రాహుల్ గాంధీ ఎక్స్ లో ఆరోపించారు. మీరు చేస్తున్నది తప్పు. మిమ్మల్ని పట్టుకుంటాం” అని ఎన్నికల అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇది ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి. దేశ ద్రోహ చర్య. సమగ్ర విచారణ చేయాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని, ఆయన పదవిలో ఉండే హక్కు లేదని మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా విమర్శించారు. ఫారం 6 దుర్వినియోగం, సాఫ్ట్వేర్ దుర్వినియోగం, ఓటర్ల జాబితా తారుమారు జరిగిందని ఆరోపించారు.