నకిలీ పన్నీర్‌పై దేశవ్యాప్త నిషేధానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ముసాయిదా
పాల పదార్థాలు కాని ఉత్పత్తులకు ‘పన్నీర్’ పేరు వాడకుండా 60 రోజుల్లో అభిప్రాయాలు కోరిన ఆహార భద్రత సంస్థ
వినియోగదారుల ఆరోగ్యం, ఆహార పదార్థాల నాణ్యతను దృష్టిలో ఉంచుకుని అనలాగ్ పన్నీర్ ఉత్పత్తి, విక్రయాలపై దేశవ్యాప్త నిషేధానికి భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. పాల పదార్థాలు కాని ఉత్పత్తులకు ‘పన్నీర్’ పేరు వాడరాదని ప్రతిపాదించింది.
పాలు, పాల పదార్థాలతో కాకుండా వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్‌లు, వృక్ష సంబంధిత కొవ్వులతో తయారుచేసే కృత్రిమ ఉత్పత్తులు మార్కెట్లలో, హోటళ్లలో అసలైన పన్నీర్ స్థానంలో వినియోగంలోకి రావడంతో కేంద్ర నియంత్రణ సంస్థ ఈ చర్యకు సిద్ధమైంది. ఆహార భద్రత ప్రామాణిక అమ్మకాల నిషేధ, పరిమితులు సవరణ నిబంధనలు-2026 ముసాయిదాపై వాటాదారులు, వినియోగదారులు, పరిశ్రమ వర్గాల నుంచి 60 రోజుల్లో అభిప్రాయాలు స్వీకరించనుంది. ‘అనలాగ్ ఇన్ డెయిరీ కాంటెక్స్ట్’ కింద లైసెన్సులు పొందిన సంస్థలు తమ లేబుళ్లు, ప్రకటనలు, మార్కెటింగ్ ప్రచారాల్లో ‘పన్నీర్’ పదాన్ని తొలగించాల్సి ఉంటుంది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ ముసాయిదా ప్రకారం, పన్నీర్ పేరుతో అమ్మే ఉత్పత్తి పాలు లేదా పాల పదార్థాల ఆధారంగా ఉండాలి. పాలకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో తయారుచేసే అనలాగ్ ఉత్పత్తులను అదే పేరుతో విక్రయించడం వినియోగదారులను తప్పుదారి పట్టించే అంశంగా పరిగణించబడుతుంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే తయారీదారులు ప్యాకేజింగ్, సరఫరా గొలుసు, రెస్టారెంట్ మెనూ వివరాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు తక్కువ ధర కారణంగా ఇలాంటి పదార్థాలను విస్తృతంగా వినియోగిస్తున్నాయని ఆహార భద్రత అధికారులు గుర్తించారు.
HIGHLIGHTS
- అనలాగ్ పన్నీర్‌పై దేశవ్యాప్త నిషేధానికి ముసాయిదా
- అభిప్రాయాల కోసం 60 రోజుల గడువు
- ‘పన్నీర్’ పేరు వాడకంపై కఠిన ప్రతిపాదన
- మహారాష్ట్ర, గుజరాత్లో ఇప్పటికే నిషేధం
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా తమ ప్లాట్ఫామ్లో అనలాగ్ డెయిరీ పదార్థాలు వాడే రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఇప్పటికే ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనలాగ్ పన్నీర్ విక్రయాలపై నిషేధం విధించాయి. కేంద్ర స్థాయిలో నిబంధనలు ఖరారైతే దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రమాణాలు అమల్లోకి వస్తాయి. దీనివల్ల వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందడంతో పాటు నిజమైన డెయిరీ ఉత్పత్తిదారులు, పాల రైతులకు మద్దతు లభించనుంది.
పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ప్రజా సూచనలు పరిశీలించిన తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ తుది నిబంధనలు ప్రకటించనుంది. తుది ప్రకటన తర్వాత తయారీదారులు, విక్రేతలు, రెస్టారెంట్లు కొత్త లేబులింగ్, అమ్మకాల ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఆహార భద్రత అధికారులు తనిఖీలను బలోపేతం చేసి, ‘పన్నీర్’ పేరుతో నకిలీ లేదా అనలాగ్ ఉత్పత్తులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
