దేశవ్యాప్తంగా 4 కొత్త రైళ్లు, 3 సర్వీసుల పొడిగింపులకు రైల్వే బోర్డు ఆమోదం
ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఆధారంగా 12 రైళ్లకు అదనపు హాల్టులు మంజూరు చేసిన రైల్వే బోర్డు
దేశంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరిచే చర్యల్లో భాగంగా భారతీయ రైల్వే 4 కొత్త రైలు సర్వీసులు, 3 సర్వీసుల పొడిగింపులు, 12 అదనపు హాల్టులకు ఆమోదం తెలిపింది. ప్రారంభ తేదీలను సంబంధిత రైల్వే జోన్లు త్వరలో ప్రకటిస్తాయని అధికారులు తెలిపారు.
రాయ్‌పూర్–రౌఘాట్ మెమూ, హరిద్వార్–వెరావల్ ఏసీ ఎక్స్‌ప్రెస్, హరిద్వార్–ఓఖా ఏసీ ఎక్స్‌ప్రెస్, బిర్–ఇటార్సీ ప్యాసింజర్ కొత్తగా ఆమోదం పొందాయి. రాయ్‌పూర్–రౌఘాట్ మెమూ శనివారం మినహా వారానికి 6 రోజులు నడవనుంది. హరిద్వార్–వెరావల్ సర్వీస్ వారానికి 2 సార్లు, హరిద్వార్–ఓఖా వారానికి 1సారి నడుస్తాయి. బిర్–ఇటార్సీ ప్యాసింజర్ వారాంత సేవగా అందుబాటులో ఉంటుంది.
హరిద్వార్–వెరావల్ రైలు రూర్కీ, ముజఫర్‌నగర్, మీరట్ సిటీ, ఘజియాబాద్, ఢిల్లీ, జైపూర్, అజ్మీర్, అబూ రోడ్, రాజ్‌కోట్, జునాగఢ్ వంటి స్టేషన్లలో ఆగుతుంది. హరిద్వార్–ఓఖా సర్వీస్ ఢిల్లీ, జైపూర్, అజ్మీర్, రాజ్‌కోట్, జామ్‌నగర్, ద్వారక మార్గంలో నడుస్తుంది. రౌఘాట్ నుంచి ఉదయం 6:30 గంటలకు బయలుదేరే మెమూ మధ్యాహ్నం 1:05 గంటలకు రాయ్‌పూర్ చేరుతుంది.
బాంద్రా టెర్మినస్–ఢిల్లీ సరాయ్ రోహిల్లా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌ను హరిద్వార్ వరకు పొడిగించారు. పొడిగింపు మార్గంలో ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్ సిటీ, ముజఫర్‌నగర్, రూర్కీ స్టాపులు ఉంటాయి. గోండియా–వాడ్సా మెమూ, వాడ్సా–చందా ఫోర్ట్ మెమూ సర్వీసులను అర్మోరి వరకు పొడిగించారు.
HIGHLIGHTS
- 4 కొత్త రైలు సర్వీసులకు ఆమోదం
- 3 సర్వీసులు మరింత దూరం పొడిగింపు
- 12 రైళ్లకు కొత్త హాల్టులు
- జోన్లు త్వరలో తేదీలు ప్రకటించనున్నాయి
వల్సాడ్–వడనగర్ ఎక్స్‌ప్రెస్‌కు అంకలేశ్వర్, సహర్సా–అమృత్‌సర్ గరీబ్ రథ్‌కు పానిపట్, హైదరాబాద్–రక్సాల్ ఎక్స్‌ప్రెస్‌కు రిగా, తిరుపతి–రక్సాల్ ఎక్స్‌ప్రెస్‌కు బైరగ్నియా హాల్టులు మంజూరయ్యాయి. దర్భంగా–గోమతి నగర్ అమృత్ భారత్‌కు రిగా, లౌకహా బజార్–ఆనంద్ విహార్ స్పెషల్‌కు ఘోరసహన్, బాంద్రా–జైపూర్ ఎక్స్‌ప్రెస్‌కు నవ్‌సారి, అలప్పుజ–కన్నూర్ ఎక్స్‌ప్రెస్‌కు వల్లిక్కున్ను హాల్టులు కల్పించారు.
KSR బెంగళూరు–ఎర్నాకుళం జంక్షన్ ఎక్స్‌ప్రెస్‌కు ఒట్టపాలెం, లోకమాన్య తిలక్ టెర్మినస్–పాట్లీపుత్ర ఎక్స్‌ప్రెస్‌కు గహ్మర్, సీల్దా–రాంపూర్‌హట్ ఎక్స్‌ప్రెస్‌కు బారక్‌పూర్ హాల్టులు చేరాయి. ప్రయాణికుల డిమాండ్, స్థానిక అవసరాలు, కనెక్టివిటీ ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
కొత్త సర్వీసుల ప్రారంభ తేదీలు, పొడిగింపుల అమలు తేదీలు, సమగ్ర టైమ్‌టేబుళ్లను సంబంధిత జోనల్ రైల్వేలు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా విడుదల చేయనున్నాయి. ప్రయాణికులు అధికారిక ప్రకటనల ఆధారంగా రిజర్వేషన్, ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
