మధ్యప్రదేశ్‌లో దీపావళి వేళ ఘోర అగ్నిప్రమాదాలు.. చిన్నారులు, పసికందుతో సహా 13 మంది మృతి
మధ్యప్రదేశ్‌లో దీపావళి వేడుకల సమయంలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. సియోనీ, కట్నీ, ఉజ్జయినీ జిల్లాల్లో చోటుచేసుకున్న మూడు వేర్వేరు అగ్నిప్రమాదాల్లో ఆరుగురు కుటుంబ సభ్యుల చొప్పున రెండు ప్రాంతాల్లో 12 మంది, మరో ఘటనలో వృద్ధుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 13 మంది మృతి చెందగా, వారిలో చిన్నారులు, రెండు నెలల పసికందు కూడా ఉన్నారు.
సియోనీలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
సియోనీ జిల్లాలోని ఛపారా పట్టణం మహావీర్ వార్డులో జైన దేవాలయం సమీపంలో ఉన్న బంగారు ఆభరణాల వ్యాపారి కుందన్ లాల్ సోనీకి చెందిన మూడు అంతస్తుల భవనంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య మంటలు చెలరేగాయి.
ఆ సమయంలో ఇంట్లో మొత్తం పది మంది ఉండగా, ఆరుగురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. మృతుల్లో కుందన్ లాల్ సోనీ (75), ఆయన భార్య రాజ్‌కుమారి సోనీ (65), రీతూ సోనీ (42), స్మృతి సోనీ (40), సూర్య సోనీ (45), ఆదిత్య సోనీ (16) ఉన్నారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
కట్నీలో క్రాకరీ దుకాణంలో మంటలు.. ఆరుగురు మృతి
కట్నీ జిల్లాలోని బర్హీ పట్టణంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల భవనంలో కింద ఉన్న క్రాకరీ దుకాణంలో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భవనం అంతటా వ్యాపించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
మృతులను దుకాణ యజమాని పురాన్ అగర్వాల్ (77), ఆయన భార్య చంద్రకళ (74), కోడలు పూనమ్, మనవరాళ్లు ఆర్య (14), అన్వి (6), రెండు నెలల పసికందుగా గుర్తించారు. తల్లి పూనమ్ ఒడిలోనే పసికందు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
ఉజ్జయినీలో పొగ పీల్చి 107 ఏళ్ల వృద్ధుడి మృతి
ఉజ్జయినీలోని నాగ్‌ఝిరి ప్రాంతంలో దీపావళి రాత్రి సుమారు 9 గంటల సమయంలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు అంతస్తుల భవనం కింద ఉన్న రెండు దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ దుకాణాల్లో హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో పాటు ఆయిల్ పెయింట్లు, ఇతర మండే పదార్థాలు ఉండటంతో మంటలు, దట్టమైన పొగ వేగంగా వ్యాపించాయి.
ఆ సమయంలో భవనం పై అంతస్తులో ఒకే కుటుంబానికి చెందిన పది మంది చిక్కుకుపోయారు. స్థానిక వ్యాపారులు, ప్రజలు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టి పది మందిని బయటకు తీసుకొచ్చారు. అయితే 107 ఏళ్ల మోహన్‌లాల్ మాత్రం తీవ్రంగా పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు.
ఆయనను ప్రభుత్వ చరక్ భవన్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కుటుంబ సభ్యులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
మూడు ఘటనలు.. 13 మంది మృతి
దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ మూడు అగ్నిప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. సియోనీ, కట్నీల్లో ఒకే కుటుంబాలకు చెందిన ఆరుగురు చొప్పున మరణించగా, ఉజ్జయినీలో 107 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు, పసికందు సహా 13 మంది మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా ఆవేదనకు కారణమైంది.
