99TV News

    మణిపూర్‌లో శబ్ద నిరసన | ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం

    మణిపూర్‌లో శబ్ద నిరసన | ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం

    మణిపూర్‌లో శబ్ద నిరసన.. ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం

    మణిపూర్‌లో కొనసాగుతున్న సంక్షోభానికి వ్యతిరేకంగా ఐదు లోయ జిల్లాల్లో వేలాది మంది ప్రజలు శుక్రవారం సాయంత్రం వినూత్న నిరసన చేపట్టారు. సంప్రదాయ కాంగ్లా ఆచారాలను స్ఫూర్తిగా తీసుకుని ‘శబ్ద నిరసన’ నిర్వహించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో ప్రభుత్వం విఫలమైందని నిరసనకారులు విమర్శించారు.

    ఫెడరేషన్ ఆఫ్ హౌమీ అనే పౌర సమాజ సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు ప్రజలు పాత్రలు మోగించడం, డ్రమ్స్ వాయించడం, విద్యుత్ స్తంభాలపై సుత్తులతో కొట్టడం, వాహనాల హారన్లు, సైరన్లు మోగించడం ద్వారా నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సింగ్జమేయి ప్రాంతంలోనూ ఆందోళన జరిగింది.

    అనంతరం పలువురు కాంగ్లా కోట వైపు కదలగా, భద్రతా బలగాలు పలు ప్రాంతాల్లో వారిని అడ్డుకున్నాయి. కోట వద్ద ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

    రాష్ట్రంలో జాతీయ పౌరుల రిజిస్టర్ అమలు, అక్రమ వలసదారుల గుర్తింపు, సాయుధ బృందాలతో కుదిరిన సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఒప్పందం రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అక్టోబర్ 19న సునురోక్‌లో ముగ్గురు మైతేయి కలప సేకరణదారుల హత్య తర్వాత భద్రతా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు మరింత పెరిగాయి.