Odisha Coast | ఒడిశా తీరంలో మునిగిపోయిన కార్గో షిప్.. 22 మంది సిబ్బంది గల్లంతు
ఒడిశా తీరంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న కార్గో నౌక ప్రమాదానికి గురై మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలోని 22 మంది సిబ్బంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి.
పారదీప్‌కు 240 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం
పనామాకు చెందిన ఎంవీ ఓషన్ విన్నర్ అనే కార్గో నౌక ఒడిశా నుంచి ఐరన్ ఓర్ లోడ్ చేసుకుని శుక్రవారం సింగపూర్ బయల్దేరింది. అయితే బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో నౌకతో సంబంధాలు తెగిపోయాయి.
కొద్దిసేపటికే నౌక మునిగిపోయినట్లు సమాచారం అందింది. నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇద్దరు రక్షణ.. 22 మంది కోసం గాలింపు
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డ్ రంగంలోకి దిగాయి. సహాయక చర్యల్లో భాగంగా ఇద్దరిని రక్షించినట్లు సమాచారం. మిగిలిన 22 మంది సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నౌకలో 20 మంది చైనా పౌరులు, ముగ్గురు మయన్మార్ పౌరులు, ఒక బంగ్లాదేశ్ పౌరుడు ఉన్నట్లు సమాచారం.
ఇతర నౌకలకు అలర్ట్
నౌక ప్రమాదానికి గురైన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఇతర నౌకలను అధికారులు అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.
ప్రస్తుతం గల్లంతైన సిబ్బంది కోసం ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై అధికారుల నుంచి మరింత సమాచారం రావాల్సి ఉంది.
