న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సీఆర్లో మహిళలు, బాలికల భద్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వరుస అత్యాచార ఘటనలను సుమోటోగా విచారించిన సుప్రీంకోర్టు.. మహిళలు రాత్రి వేళల్లోనూ ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, పోలీసులపై ఉందని సుప్రీం స్పష్టం చేసింది.జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. నేరాలు జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా.. నేరాలను ముందుగానే అడ్డుకునేలా నిరోధక చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించింది. “రాత్రి 10 గంటల సమయంలోనైనా ఒక మహిళ ఎలాంటి భయం లేకుండా రోడ్డుపై నడవగలగాలి” అని కోర్టు పేర్కొంది. మెట్రో, బస్సులు, రోడ్డు మార్గాల్లో ప్రయాణించే మహిళలకు పూర్తి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి
మహిళలు, బాలికలకు ప్రమాదకరంగా ఉండే ప్రాంతాలను పోలీసులు గుర్తించి అక్కడ నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా రోడ్లు, పార్కులు, మెట్రో స్టేషన్లు, బస్సులు, సబ్వేలు, రైల్వే స్టేషన్లు వంటి ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని సూచించింది.చీకటి ప్రాంతాల్లో మెరుగైన స్ట్రీట్ లైటింగ్, సీసీటీవీ కెమెరాలు, పోలీస్ పెట్రోలింగ్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రజలకు పోలీసులపై నమ్మకం కలగాలి
ఢిల్లీ పోలీసులకు కోర్టు కీలక సూచనలు చేసింది. ఇది పోలీసు శాఖ ముందున్న పెద్ద సవాలు అని పేర్కొన్న ధర్మాసనం.. ఈ సవాలును అధిగమించడం పోలీసు శాఖకు గొప్ప విజయమవుతుందని వ్యాఖ్యానించింది.ప్రజలు పోలీసులను చూసి భయపడే పరిస్థితి ఉండకూడదని, సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పోలీసుల వద్దకు స్వేచ్ఛగా వచ్చేలా పోలీసుల స్పందన ఉండాలని సూచించింది. సాధారణ ప్రజల్లో పోలీసులపై నమ్మకం, భరోసా కలిగించే విధంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
మహిళల భద్రత అనేది కేవలం శాంతిభద్రతల అంశం మాత్రమే కాదని.. అది రాజ్యాంగంలోని జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్ను మహిళలకు సురక్షిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు శాఖలు సమన్వయంతో, పూర్తి జవాబుదారీతనంతో పనిచేయాలని కోర్టు సూచించింది.
