99TV News

    ఔషధ ధరల దోపిడీపై Supreme Court తీవ్ర వ్యాఖ్యలు

    అధిక ఔషధ ధరలు దోపిడీనే: Supreme Court వ్యాఖ్యలు

    రోగులపై పడుతున్న మందుల ధరల భారంపై కేంద్రం వైఖరిని ప్రశ్నించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం

    మందుల అధిక ధరలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫార్మా కంపెనీలు, రిటైల్ మెడిసిన్ విక్రేతలు రోగులు, వారి కుటుంబాల నుంచి అసాధారణంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారన్న అంశంపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కేంద్రం మౌనాన్ని ప్రశ్నించింది.

    మందుల ధరల నియంత్రణ అత్యంత కీలకమని ధర్మాసనం పేర్కొంది. ప్రజలు మందుల కోసం ఇళ్లు, ఆభరణాలు అమ్ముకునే పరిస్థితి వస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. అన్ని మందులను ధర నియంత్రణ విధానంలోకి తీసుకురావాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోని జన్ ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచాలని సూచించింది.

    క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఒక మందును ఉదాహరణగా ప్రస్తావించిన ధర్మాసనం, తయారీదారు రిటైలర్‌కు రూ.2,770కి సరఫరా చేసిన మందుకు ఎంఆర్పీ రూ.27,000గా ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. “ఇది బహిరంగ దోపిడీ. రూ.2,700కి రిటైలర్‌కు ఇచ్చే మందుకు రూ.27,000 ఎంఆర్పీ ఎలా ఉంటుంది?” అని ధర్మాసనం విచారణలో ప్రశ్నించింది.

    కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం. నటరాజ్ వాదనలు వినిపిస్తూ, మందులు అందరికీ అందుబాటులో ఉండేలా చూడడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అయితే ధర్మాసనం మధ్యలోనే జోక్యం చేసుకుని, సమస్య అందుబాటులో ఉండడమే కాదని, సమంజసమైన ధరలో అందుబాటులో ఉండడమే ప్రధానమని స్పష్టం చేసింది.

    “ఇది దోపిడీ కాకపోతే మరేమిటి? ప్రజలు మందుల కోసం ఇళ్లు, ఆభరణాలు అమ్ముకుంటున్నారు. ధర నిర్ణయం చాలా ముఖ్యం. అన్ని మందులనూ ధర నియంత్రణ విధానంలోకి తీసుకురావాలి” అని ధర్మాసనం పేర్కొంది.

    HIGHLIGHTS

    - మందుల అధిక ఎంఆర్పీలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

    - రూ.2,770 మందుకు రూ.27,000 ఎంఆర్పీ ప్రస్తావన

    - అన్ని మందులపై ధర నియంత్రణ అవసరమని ధర్మాసనం వ్యాఖ్య

    - కేంద్రం తరఫున కె.ఎం. నటరాజ్ వాదనలు

    సుప్రీంకోర్టు న్యాయవాది కె.సి. జైన్, ఆగ్రాకు చెందిన వైద్యుడు సంజయ్ కులశ్రేష్ఠ దాఖలు చేసిన ప్రజాహిత పిటిషన్లను ధర్మాసనం విచారించింది. పిటిషనర్లు కొన్ని మందుల బిల్లులను కోర్టు ముందు ఉంచి, వాస్తవ మార్కెట్ ధరతో పోలిస్తే ఎంఆర్పీ 10 నుంచి 16 రెట్లు ఎక్కువగా ముద్రిస్తున్నారని తెలిపారు.

    టైగెబెక్స్ 50 ఎంజీ అనే యాంటీబయోటిక్ మందు ఎంఆర్పీ రూ.5,635గా ఉందని, కార్పొరేట్ హాస్పిటళ్లలో అదే ధరకు విక్రయిస్తుండగా, బహిరంగ మార్కెట్‌లో అది రూ.350కే లభిస్తోందని సంజయ్ కులశ్రేష్ఠ కోర్టుకు తెలిపారు. “అంటే హాస్పిటల్ వాస్తవ రిటైల్ ధర కంటే 16 రెట్లు వసూలు చేస్తోంది” అని ఆయన అన్నారు.

    ధరల్లో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. “తయారీదారు ఎంఆర్పీలో 10 శాతం ధరకు రిటైలర్‌కు ఇచ్చే మందుకు ఇంత అధిక ఎంఆర్పీ ఎందుకు? ఇది స్పష్టంగా మోసం కనిపిస్తోంది” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

    ఫార్మా కంపెనీల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ, లాభాలు కంపెనీలకే వస్తున్నాయన్న ఆరోపణ సరైందేమీ కాదని తెలిపారు. దీనిపై సంబంధిత డేటాను సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఆయన కోరగా, కోర్టు అనుమతించింది. తదుపరి విచారణలో కేంద్రం, కంపెనీలు ధరల నిర్మాణం, ఎంఆర్పీ విధానం, నియంత్రణ చర్యలపై వివరాలు సమర్పించనున్నాయి.