న్యూఢిల్లీ:
ఓటరు నమోదు మరియు సవరణలకు సంబంధించి ఎన్నికల సంఘం (ECI) అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫారం-6, ఫారం-7, ఫారం-8 ల రూపాన్ని లేదా వాటి నిబంధనలను సవరించడానికి ఎన్నికల కమిషన్కు ఎలాంటి అధికారం లేదని దేశ అత్యున్నత నాయస్థానం స్పష్టం చేసింది.
ఢిల్లీలో చేపట్టిన ప్రత్యేక త్రీవ్ర సవరణ (SIR) ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. దిల్లీలో దాదాపు 47 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం, ఆ తర్వాత వారిని మళ్లీ కొత్త ఓటర్ల మాదిరిగా ఫారం-6 నింపాలని కోరడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు చేసిన ప్రధాన వ్యాఖ్యలు:
ఫారాల మార్పు నిషిద్ధం: ఫారం-6 (కొత్త ఓటర్ల నమోదు), ఫారం-7 (పేర్ల తొలగింపు), ఫారం-8 (చిరునామా మార్పులు/సవరణలు) అనేవి చట్టబద్ధంగా నిర్దేశించిన ఫారాలని, వాటి నియమాలను లేదా రూపాన్ని ఈసీ తన ఇష్టానుసారం మార్చడానికి వీల్లేదని కోర్టు తేల్చిచెప్పింది.
పాత ఓటర్లకు ఫారం-6 ఎందుకు?: ఇప్పటికే ఓటరు జాబితాలో పేరుండి తొలగించబడిన వారిని 'కొత్త ఓటర్లు'గా పరిగణిస్తూ ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అనడం తీవ్ర వైరుధ్యమని, దానికి బదులు ఎన్యుమరేషన్ ఫారం లేదా ఫారం-8 నింపే అవకాశం ఇవ్వాలని సూచించింది.
కటాఫ్ తేదీలు పెట్టవద్దు: ఢిల్లీలో ప్రస్తుతం తక్షణమే ఎన్నికలేవీ లేవని, అలాంటప్పుడు అక్టోబర్ 30 లోగా ప్రక్రియ పూర్తి చేయాలని గడువు విధించడం ఎందుకని ప్రశ్నించింది. ఓటు హక్కు ప్రాథమికమైనదని, నమోదుకు ఎలాంటి కటాఫ్ తేదీలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేసింది.
47 లక్షల ఓటర్ల జాబితా ప్రచురణ: జాబితా నుంచి తొలగించిన 47 లక్షల మంది ఓటర్ల వివరాలను బహిరంగంగా ప్రచురించాలని, ఓటర్లకు అవగాహన కల్పించి వారే స్వయంగా వివరాలు సరిచేసుకునేలా ఈసీ బాధ్యత తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
