రూ.3,230 కోట్లతో యుగే యుగీన్ భారత్ మ్యూజియం
భారతదేశ చరిత్ర, సంస్కృతి, నాగరికతను ప్రపంచానికి చాటిచెప్పేలా దేశ రాజధాని ఢిల్లీలో భారీ మ్యూజియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రూ.3,230 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘యుగే యుగీన్ భారత్’ మ్యూజియం అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) ఈ నిర్ణయం తీసుకుంది.
నార్త్, సౌత్ బ్లాక్‌లలో మ్యూజియం
ఢిల్లీలోని చారిత్రక నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలను మ్యూజియంగా మార్చనున్నారు. ఈ భవనాల చారిత్రక, నిర్మాణ వారసత్వాన్ని కాపాడుతూనే వాటిని ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రజా సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు.
సుమారు 1,78,509 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మ్యూజియం రూపుదిద్దుకోనుంది. ప్రదర్శన విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా దీన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
భారత నాగరికతకు అద్దం పట్టేలా గ్యాలరీలు
భారతదేశ నాగరికత ప్రయాణం, సంప్రదాయాలు, కళలు, విజ్ఞాన వ్యవస్థలు, సాంస్కృతిక వారసత్వాన్ని ఈ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఆధునిక సాంకేతికత, ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేయనున్నారు.
ఆర్కిటెక్చర్ అండ్ సిటీస్కేప్స్, గణితం-ఖగోళ శాస్త్రం, భాషలు-లిపులు, విశ్వాసాలు-ఆధ్యాత్మికత, వాణిజ్యం-ఆలోచనల ద్వారా భారత్ అనుసంధానం వంటి అంశాలపై ప్రత్యేక గ్యాలరీలు రూపొందించనున్నారు.
2027లో తొలి గ్యాలరీ ప్రారంభం
ఈ ప్రాజెక్టును 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు దశలవారీగా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా అలంకరణ (Adornment) అంశంపై రూపొందించే తొలి గ్యాలరీని 2027 ద్వితీయార్థంలో నార్త్ బ్లాక్‌లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మ్యూజియంలో ప్రదర్శించేందుకు నేషనల్ మ్యూజియం, ఇతర సాంస్కృతిక సంస్థలు, పురావస్తు ప్రదర్శనశాలలు, ప్రైవేట్ సేకరణల నుంచి సుమారు 18 లక్షల వస్తువులను గుర్తించారు.
ఏడాదికి కోటి మంది సందర్శకుల లక్ష్యం
ఈ మ్యూజియాన్ని ఏడాదికి కోటి మంది సందర్శించేలా సౌకర్యాలు కల్పించనున్నారు. విద్యార్థులు, పరిశోధకులు, చరిత్రకారులు, దేశీయ, విదేశీ పర్యాటకులకు భారతదేశ నాగరికతను సమగ్రంగా తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు.
మ్యూజియం అభివృద్ధి ద్వారా చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు సాంస్కృతిక పర్యాటకం, పరిశోధన, విద్యా రంగాలకు కూడా ప్రోత్సాహం లభించనుంది.
