స్థానిక ఎన్నికల్లో టీడీపీ–జనసేన కలిసి పోటీ
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు విజయవంతమైనట్లు జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన చర్చల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన కూటమి స్ఫూర్తితోనే స్థానిక ఎన్నికల్లోనూ ముందుకు వెళ్తామని చెప్పారు. గెలుపు అవకాశాలను ప్రాతిపదికగా తీసుకుని సీట్ల కేటాయింపు చేసినట్లు వెల్లడించారు.
ఏ పార్టీ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందో, ఉమ్మడి అభ్యర్థులు ఎవరనేది రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. కార్యకర్తల మనోభావాలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లోనూ పొత్తు కొనసాగుతుందని జనసేన నేతలు స్పష్టం చేశారు.
